ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంలో ఊరట
posted on Apr 7, 2025 3:18PM

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ సీఐడీని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వైసీపీ హయాంలో మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విదితమే.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అరెస్టు చేసింది కూడా. అయితే ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. అయినా సరే మిథున్ రెడ్డి తనను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ముందు హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు ఎఫ్ ఐఆర్ లో పేరు లేకుండా ముందస్తు బెయిలు పిటిషన్ ఎలా ధాఖలు చేస్తారని ప్రశ్నించి, ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను మంగళవారం (ఏప్రిల్ 7) విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.