మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ

 


వెబ్ సిరీస్ : మీర్జాపూర్ 3
నటీనటులు: పంకజ్ త్రిపాఠి,  అలీ ఫజల్, విక్రాంత్ మస్సే, దివ్యేందు, శ్వేతా త్రిపాఠి, రషిక దుగల్, విజయ్ వర్మ, అంజుమ్ శర్మ, షాజీ చౌదరి
ఎడిటింగ్: సిద్దేశ్వర్ ఏకాంబే
మ్యూజిక్: జాన్ స్టువర్ట్ ఏడూరి
సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్
నిర్మాతలు: ఫర్హాన్ అక్తర్ , రితేశ్ శిద్వానీ
దర్శకత్వం: గుర్నీత్ సింగ్, ఆనంద్ అయ్యర్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్  వీడియో


కథ :

మీర్జాపూర్ మొదటి సీజన్, రెండవ సీజన్ చూసిన వారికే ఈ మూడవ సిరీస్ కథ అర్థమవుతుంది. అయితే రెండవ సీజన్ చివర్లో కాలీన్ భయ్యా తప్పించుకోవడంతో ఆ సిరీస్ ముగిసింది. దానికి కొనసాగింపుగా ఈ కథ మొదలైంది. మున్నా భయ్యా భార్య మాధురి(ఇషా తల్వార్) అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటుంది. మున్నా భయ్యా చనిపోవడంతో అతని అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడికి శరద్ శుక్లా వచ్చి.. మీర్జాపూర్ ని దక్కించుకునేందుకు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మాధురిని కోరతాడు. కాలీన్ భార్య బినా త్రిపాఠి(రషిక దుగల్) అండతో గుడ్డు భయ్యా( అలీ ఫజల్) కొత్త డాన్  అవుతాడు. అతడికి సహాయంగా గోలు(శ్వేత త్రిపాఠి) ఉంటుంది. మరోవైపు కాలీన్ భయ్యాని కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కలిసి మీర్జాపూర్ ని తిరిగి ఎలా దక్కించుకోవాలని చూస్తుంటారు. అదేసమయంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న మాధురి మీర్జాపూర్ సింహాసనం నుండి గుడ్డు  భయ్యా ని దింపడానికి శరద్ శుక్లా, దద్దా త్యాగితో పాటు అతని కుమారుడు విజయ్ వర్మ మద్దతు తీసుకుంటుంది. మరి ఈ తరుణంలో గుడ్డు భయ్యా మీర్జాపూర్ ని తన గుప్పిట్లో ఉంచుకోగలిగాడా? గుడ్డు షూట్ చేశాక కాలిన్ భయ్యా ఎలా తిరిగొచ్చాడు? ముఖ్యమంత్రి మాధురి మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకుందా లేదా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

మీర్జాపూర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇందులో మున్నా భయ్యా సూటిగా మాట్లాడే మాటల కోసం, కాలీన్ భయ్యా, గుడ్డు భయ్యా, గోలు పాత్రలకి యువత బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సీజన్ మొదలైన నుండి ఫ్యాన్ బేస్ పెరుగుతూ వచ్చింది. అయితే ఈ సీజన్ 3 లో మున్నా భయ్యా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే అతడి ట్రూ లవ్ , అతడి బిహేవియర్, అతడి మాటల కోసం ఫ్యాన్స్ ఉంటారు.

ఇక మున్నా భయ్యా  అంత్యక్రియలతో మొదలైన ఈ సిరీస్ కాలీన్ భయ్యా బ్రతికే ఉన్నాడని చూపిస్తూ ఆసక్తిగా మొదలైంది. అయితే నాలుగు ఎపిసోడ్‌ల వరకు కాలీన్ భయ్యా కనపడడు. ఇక ఈ సిరీస్ లో గోలు, బినా త్రిపాఠీలకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ దక్కింది. వీరితో పాటు విజయ్ వర్మ నటన సిరీస్ కే అదనపు బలంగా నిలిచింది‌.

గత రెండు సీజన్లలో ఎక్కువగా గన్స్ అండ్ బ్లడ్ , అడల్ట్ సీన్స్ తో సాగడంతో యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ సీజన్ లో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా పొలిటికల్ డ్రామాని ఎక్కువగా చూపించారు. సిరీస్ లో ప్రతీ ఎపిసోడ్ యాభై నిమిషాల పైనే ఉంటుంది‌. అందులో కొన్ని సీన్లు ఎందుకు ఉంచారో అర్థం కాదు. మొదటి ఎపిసోడ్ లో ఉన్న క్యూరియాసిటి రెండు, మూడు, నాలుగు ఎపిసోడ్‌లలో కనపడదు. చివరి రెండు ఎపిసోడ్‌లు సిరీస్ కి ప్రధానంగా నిలిచాయి. 

మీర్జాపూర్ అభిమానులు మిస్ అవ్వకుండా చూడాల్సిందే కానీ కామన్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాదు. కాలీన్ భయ్యా కనపడినంత సేపు బాగుంటుంది‌‌‌. మరోవైపు బినా త్రిపాఠి కొడుకుకి ఎవరు తండ్రి అనే క్వశ్చన్ మార్క్ అలానే ఉంటుంది.  ఒక్కో ఎపిసోడ్ లోని స్లో సీన్లని తీసేసి, పొలిటికల్ డ్రామాని తగ్గించి ఉంటే స్క్రీన్ ప్లే గ్రిస్పింగ్ గా ఉండేది.  కానీ అదేదీ చేయకపోవడంతో ఇంకెప్పుడు అవుతుందా అనే భావన ఆడియన్స్ లో కలుగుతుంది. మొత్తం పది ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ లో అందరు ప్రాణం పెట్టి చేశారు. అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అసభ్య పదజాలం వాడారు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. జిజిఎమ్ కొన్ని చోట్ల బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలవలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

కాలిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డు పండిత్ గా అలీ ఫజల్, బబ్లూ పండిత్ గా విశ్రాంత్ మాస్సే, మున్నా భాయ్ గా దివ్యేందు, గోలుగా శ్వేతా త్రిపాఠి, బీనా త్రిపాఠిగా రసిక దుగల్, భరత్ త్యాగిగా  విజయ్ వర్మ ఈ సిరీస్ ఫ్రధాన బలంగా నిలిచారు. మిగతా వారు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా :

నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికి ఈ సిరీస్ ఫ్యాన్స్ చూసేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.


రేటింగ్: 2.5 / 5 

✍️. దాసరి  మల్లేశ్