మానసిక ఆరోగ్య సమస్యలకు ముచ్చటైన వైద్యమిదిగో!

చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. వీటిని జయించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటి విషయంలో ఫలితాలు మాత్రం కాస్త నిరాశగానే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా దానిలో సఫలం అయ్యేవారు చాలా కొద్దిమందే ఉంటారు. అయితే ఒత్తిడి అనేది పూర్తిగా మనిషి మానసిక పరిస్థితి వల్ల కలిగేది. దీన్ని జబ్బు కింద జమచేసి చాలా కాలమే అయినా దీనికి తగిన మందు మాత్రం కనుగొనలేకపోయారు. అయితే ఒత్తిడి జయించడానికి ఎప్పుడూ చేసే ప్రయత్నాలే కాకుండా దాని గురించి అందరినీ అలర్ట్ చేస్తూ ఒత్తిడి భూతానికి దూరంగా ఉండేందుకూ, ఒత్తిడి సమస్య ఉన్నపుడు దాన్ని జయించడానికి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైన వాటిని చర్చించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. దాన్నే వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన దీన్ని నిర్వహిస్తారు.

మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా ఒత్తిడిలోకి జారుకుని ఎంతోమంది బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నవారు ఉన్నారు. ఎంతోమంది సెలెబ్రిటీస్ జీవితాలు కూడా ఇలాంటి సమస్య వల్ల ముగిసిపోయాయి. 

మానసిక ఒత్తిడి ఎలా పుడుతుంది??

బాధ్యతలు ఎక్కువైనప్పుడు, మనిషిని అర్థం చేసుకోనపుడు మానసికంగా అలసిపోవడం జరుగుతుంది. తగినంత విశ్రాంతి దొరకకపోతే ఆ అలసట కాస్తా ఒత్తిడిగా మారుతుంది. అది పెరుగుతూ వెళ్ళేకొద్ది విశ్వరూపం దాలుస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనీసం దాన్ని పంచుకునేవారు లేకపోవడం, వ్యక్తి నలిగిపోతున్నప్పుడు గమనించకుండా వారి మానాన వారిని వదిలేయడం వల్ల మానసిక సమస్య అనేది ప్రమాదకర సమస్యగా రూపాంతరం చెందుతోంది.

ఏమి చెయ్యాలి??

మానసిక సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఫాలో అవ్వాలి. వాటి వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు. 

మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవాలి!!

మనసు భారంగా మారితే ఒత్తిడి తాలూకూ ప్రభావం పెరుగుతుంది. అందుకే మనసును ఎప్పటికప్పుడు తేలికగా మార్చుకుంటూ ఉండాలి. ఎమోషన్స్ ని భరిస్తూ ఉండటం అంటే ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని తిరగడమే. అందుకే ఒత్తిడిని జయించాలంటే మనసును తేలికగా ఉంచుకోవడమే ఉత్తమ పరిష్కారం. 

ఇష్టమైన పనులను చేయడం!!

ఇష్టమైన పనులు చేయడంలో తృప్తి ఉంటుంది. ఈ తృప్తి మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనిషి ఎన్ని బరువులు మోస్తున్నా తనకు నచ్చిన పని చేస్తున్నాననే సాటిసిఫాక్షన్ మనిషిని హాయిగా ఉంచుతుంది.

మంచి నిద్ర!!

నిద్ర ఒక గొప్ప ఔషధం. నిద్ర సరిగ్గా ఉంటే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరికేసినట్టే ప్రతి మనిషికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది. రోజు మొత్తం అలసట నుండి శరీరానికి మెదడుకు ఆమాత్రం విశ్రాంతి కచ్చితంగా అవసరం. 

ఎమోషన్స్ ని మోయకూడదు!!

కొందరు ఏ ఎమోషన్ బయట పెట్టకుండా ఉండటం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం లేదని అనుకుంటూ వుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎమోషన్స్ ని మనిషిలో దాచుకోవడం వల్ల అవి ఒత్తిడిగా మారిపోతాయి. అలాగని అందరి ముందూ కోపం, అసహనం, ద్వేషం వంటివి వ్యక్తం చేయమని అర్థం కాదు. ఎమోషన్ క్రియేట్ అయ్యే వరకు పరిస్థితులను తీసుకెళ్లకూడదు. అలాగే ఎమోషన్స్ ని భూతద్దంతో చూడకూడదు. 

భరించకూడదు!!

కొన్నిసార్లు కొన్ని పనులను భరిస్తూ చేయాల్సి వస్తుంది. ఆ పనులు ఎలా ఉంటాయంటే మనిషిని నిమిషం కూడా స్థిమితంగా ఉండనివ్వవు. మీ బాధ్యత కాకపోతే, దాని వల్ల అదనపు ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అనిపిస్తే సున్నితంగా ఆ పనికి నో చెప్పేయచ్చు. 

నష్టం కూడా మంచిదే!!

కొన్నిసార్లు కొన్ని పనులు, కొన్ని విషయాలు వదులుకుంటే ఆర్థికంగా కొంత నష్టపోవడం మాట నిజమే. కానీ ఆ పనుల వల్ల కలిగే భీకర ఒత్తిడిని సున్నితంగా దూరం చేసినట్టు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు, కాలం, కాలం చేసే ఒత్తిడి మాయాజలంతో జాగ్రత్తగా ఉండాలి.

ఇలా ఒత్తిడి విషయంలో అన్ని రకాల మార్గాలను అన్వేషించి వాటిని అనుసరిస్తే మనిషి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందులేని జబ్బు అయిన ఈ మానసిక సమస్యలకు మనసుతోను, ఆలోచనలతోనూ వైద్యం చేసుకోవాలి.


                                   ◆నిశ్శబ్ద.