అనుభవం ఎలా వస్తుంది?

ప్రతి మనిషి తన జీవోతంలో ఏదైనా సాధించాలి అంటే అనుభవం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అనుభవం ఉన్న వారు పని చేసే విధానానికి, అనుభవం లేనివారు పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. స్వామి వివేకానంద లాంటి గొప్పవాడే అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని అన్నారు. అయితే అనుభవం ఎలా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అనుభవం అనేది దానికది వచ్చేది కాదు. అనుభవాన్ని సంపాదించుకోవాలి. ప్రతి పనీ ఒక అనుభవాన్ని పరిచయం చేస్తుంది. అందుకే చాలామంది తమపనులు తాము చేసుకోవాలి అని అంటారు. అంటే ఆ పని అనుభవం వ్యక్తికి పరిచయం కావాలని వారి ఉద్దేశ్యమన్నమాట.

అయితే నేర్చుకునే అలవాటు ఉంటేనే అనుభవం వస్తుంది. మనిషి ఎలా బ్రతకాలో అనుభవమే నేర్పిస్తుంది. బోధనలు, శాస్త్రాలు అనేవి వినడానికే బాగుంటాయి. వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకునేది అవగింజ అంత మాత్రమే. అందుకే  భోధనల ద్వారా నేర్చుకోవడం కొంతవరకే సాధ్యమవుతుందని,  అన్నీ చదివిన వారికంటే అనుభవం ఉన్నవారు ఎన్నో రెట్లు మేలని విజ్ఞానవంతులు చెబుతారు.. ఒక పనిచేయటంలో అనుభవం ఉన్న వారికి ఆ పనిలో ఉన్న మెళకువలు అన్నీ తెలుస్తాయి. తద్వారా వారు ఆ పనిని త్వరగా చేయగలరు. అదే కొత్తగా ఆ పని చేయడానికి వచ్చినవారు చేసేటప్పుడు తడబడుతూంటారు. అనుభవం గలవారి వద్ద ఉంటే మనం ఆ పనిని త్వరగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా వాడి దగ్గర నేను నేర్చుకునేదేమిటి నాకు నేనుగానే ఈ పనిని చేయగలను నేర్చుకుంటాను అనుకుంటే ఆ పనిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మనకున్న అహం అనేది మనల్ని ఇబ్బందులపాలు చేస్తుంది. 

అనుభవం అనేది ఒక పనిని మనం చేసినప్పుడో లేదా నేర్చుకున్నప్పుడో వస్తుంది. అంతేకానీ ఊరికే రాదు. మనం ఒక పనిని నేర్చుకుంటున్నపుడు ఆ పనిలో అనుభవం ఉన్న వారికి మన సందేహాలను చెప్పొచ్చు, వారి ద్వారా పరిష్కారాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా మంచి చెడ్డలు, లాభనష్టాలు దానికి సంబంధించిన అనుభవం ఉన్నవారికే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. అందువల్లే అనుభవాన్ని సంపాదించాలి. అనుభవం గలవారు చెప్పే మాటలు అప్పుడప్పుడూ కూడా వింటూ ఉండాలి. వారు అనుభవం కలవారు ఎందుకు చెప్తున్నారో అర్ధం చేసుకోవాలి. 

పనిలోగానీ, ఉద్యోగంలోగానీ ఏ రంగంలోనైనా సరే అనుభవం సంపాదించటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాము మనం ఒక ఉద్యోగాన్ని మాని వేరే ఉద్యోగానికి వెళితే అనుభవం ఉందా అని అడుగుతారు. దానినిబట్టి మనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా మనకు ఎంత జీతం ఇవ్వాలి అన్నది. ఆలోచిస్తారు. మనం ఒక పనిని లేదా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు దానిని మనం వృధా చేయకుండా కాలాన్ని వృధాగా గడవకుండా అనుభవం సంపాదించటం కోసమే పని చేయాలి. అనుభవం కోసం, పనిలో నైపుణ్యత సంపాదించడం కోసం పనిచేస్తూ పోతే ఖచ్చితంగా గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నవారిగా ఎదుగుతారు. జీవితంలో కావలసినవి అన్నీ ఆ అనుభవమే సమకూర్చుకునేలా సహాయపడుతుంది.

                                       ◆నిశ్శబ్ద.

 ⁠