లక్ష మెజారిటీ రాలే.. ఆత్మకూరు ఉప పోరులో మేకపాటి విజయం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ పై 82,888 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మొత్తం 20 రౌండ్లుగా కొనసాగింది.

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గౌతమ్‌ రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం అంటూ భారతీయ జనతా పార్టీ భరత్‌ కుమార్‌ యాదవ్‌ ను పోటీలో నిలిపింది. బీఎస్పీ తరఫున ఓబులేసు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 14 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌ నుంచీ మేకపాటి విక్రమ్‌ రెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఒక్కో రౌండ్‌ పూర్తయ్యే సరికి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యం మరింతగా పెరుగుతూనే ఉంది. పోస్టల్‌ బ్యాలెట్లతో సహా మొత్తం 20 రౌండ్లతో కలిపి మేకపాటి విక్రమ్‌ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రంరెడ్డికి మొత్తం లక్షా 2 వేల 74 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ కు 19 వేల 332 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు 4 వేల 897 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో నోటా ఓట్లు కూడా భారీగా నమోదవడం విశేషం. మొత్తం 4 వేల 179 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇతరులకు 6 వేల 599 ఓట్లు పోలయ్యాయి.

 82 వేల 888 ఓట్ల మెజార్టీతో విక్రమ్‌ రెడ్డి విజయం సాధించడంతో వైసీపీ నేతల సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ అంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరికి 90 వేలకు దిగువ మెజారిటీతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.