మరిచిపోలేని చీకటి చరిత్ర ఇందిరమ్మ ఎమర్జెన్సీ

 స్వతంత్ర భారత దేశ చరిత్రలో, జూన్ 26 ఒక చీకటి రోజుగా నిలిచి పోయింది. సరిగా 47 సంవత్సరాల క్రితం 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించారు. అంతవరకు, భారత రాజ్యాంగంలో అలాంటి పదం/ప్రొవిజన్ ఒకటి ఉందని తెలియని ప్రజలు, అదేమిటో అర్థం చేసుకునే లోగానే, దేశాన్ని చీకట్లు కమ్మేసాయి. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, ఆమె తమ కుర్చీని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య హక్కులు అన్నింటినీ కాల రాస్తూ రాత్రికి, రాత్రి అత్యవసర పరిస్థితిని విధించారు.  ఆ చీకటి చరిత్ర 21 నెలల పాటు కొనసాగింది. 

నిజానికి ఇందిరా గాంధీ, అన్నీ తెలిసి ఆ నిర్ణయం తీసుకున్నారో, లేక ప్రధాని పీఠం నిలుపుకునేందుకు ఎవరో ఇచ్చిన సలహాను  పాటించారో ఎలియదు కానీ, ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఆమె ఎమర్జెన్సీ ప్రకటన ఎంతగానో దిగజార్చి వేసింది. ప్రజాస్వామ్య దేశంలో  ప్రాథమిక హక్కులు హరించే పరిస్థితితి వస్తుందని, ప్రతిపక్ష నేతలే కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయలు వ్యక్తం  చేసే వారంతా  జైళ్లలో గడపవలసిన పరిస్థితి  ఒకటి వస్తుందని ఉహించని ప్రపంచం ముక్కున వేలేసుకుంది, 
ప్రాథమిక హక్కులు అమలులో లేకపోవడంతో ప్రభుత్వం ఎవరినైనా కాల్చివేసినా ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని ప్రఖ్యాత పాత్రికేయుడు కులదీప్ నాయర్ అరెస్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు లో ప్రభుత్వ అదనపు సొలిసిట్ జనరల్ వాదించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

భారతదేశంలో మొదటిసారిగా పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. చట్టసభలకు జరుగవలసిన ఎన్నికలను వాయిదా వేశారు. జైళ్లన్నీ నిరాయుధులైన, ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించే వారితో నింపివేసారు. చివరకు కేంద్రంలో సీనియర్ మంత్రులు సహితం ఏమీ మాట్లాడలేక తమ ఇళ్లకే పరిమితం కావలసి వచ్చింది.  దేశ చరిత్రలో మొదటిసారిగా రాజ్యాంగాతీత శక్తులు ప్రభుత్వ వ్యవహారాలలో పెత్తనం చేయడం చూశాము. 
అయితే, అత్యవసర పరిస్థితి భారత పౌర సమాజంలో నెలకొన్న చైతన్యాన్ని, వారి సంఘటిత శక్తిని మొత్తం ప్రపంచానికి వెల్లడించింది. 1971లో  బాంగ్లాదేశ్ యుద్ధంలో అనూహ్యమైన విజయం సాధించినప్పటి నుండి దేశంలో తిరుగులేని నాయకురాలిగా ఇందిరాగాంధీ వెలుగొందుతూ వచ్చారు. ఆమెను రాజకీయంగా ఎదిరించే సత్తా ప్రతిపక్షాలలో పెద్దగా కనిపించ లేదు. 
అటువంటి సమయంలో మొదట గుజరాత్ లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ మెస్ లో అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా బీహార్ కు వ్యాపించడం, దశాబ్దాలుగా రాజకీయ సన్యాసం చేపట్టిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడుతూ, అవినీతికి మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థలో సమగ్రమైన మార్పు కోసం సంపూర్ణ విప్లవం కోసం విద్యార్థులు, యువకులు ఉద్యమించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమమే అనంతర కాలంలో దేశ రాజకీయ భవిష్యత్ కు దిక్సూచిగా నిలిచింది.  

జయ ప్రకాశ్  నారాయణ్  పిలుపు విద్యుత్ తరంగం వలే దేశ వ్యాప్తంగా యువతను కదిలించడం ప్రారంభమైంది. రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలు ఉద్భవించడం ప్రారంభమైనది. ఇంతలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చినా పదవికి రాజీనామా చేయకుండా ఇందిరాగాంధీ తాత్సారం చేస్తుండడంతో ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె వెంటనే రాజీనామా చేయాలనీ జెపి డిమాండ్ చేశారు.  

అందుకోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం కోసం మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, నానాజీ దేశముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష సమితి ఏర్పాటును ప్రకటించారు.ఈ వేదిక రాజకీయాలకు వ్యతిరేకంగా సోషలిస్టుల నుంచి సంఘ్ పరివార్ వరకు విభిన్న  భావజాలాలను ఏకం చేసింది. ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలను నిషేధించడంతో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమంలో చేరారు. మొత్తం మీద లక్ష మందికి పైగా జైల్లకు వెళ్లారు. మొత్తం  ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఓ శాంతియుత ఉద్యమంలో ఇంత మంది జైళ్లకు వెళ్ళ లేదు. విదేశాలలో సహితం సుబ్రమణియన్ స్వామి వంటి వారు అత్యవసర పరిస్థితి పేరుతో భారత్ లో జరుగుతున్న అరాచక పరిస్థితుల గురించి విశేషంగా  ప్రచారం చేస్తుండడంతో అంతర్జాతీయంగా వత్తిడి పెరిగి, ఆమె  మార్చి 21, 1977న అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకో వలసి వచ్చింది.

ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ, ఆమె పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. రాజకీయ పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా పౌర ఉద్యమాల ద్వారా సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా నిలబడడంతోనే ఈ అనూహ్య ఫలితాలు సాధ్యమయ్యాయి. అందుకనే, ఆ తర్వాత మరో వేయేళ్ళ  వరకు భారత్ లో అత్యవసర  పరిస్థితి విధించే సాహసం ఎవ్వరు చేయలేరని స్వయంగా ఇందిరాగాంధీ పేర్కొనడం గమనార్హం.
 మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్ లో తేలికగా దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. అయితే ప్రజలు నిత్యం జాగురకతతో వ్యవహరించని పక్షంలో మరోసారి ఎమర్జెన్సీ విధించక పోయినా ప్రభుత్వాలు నిరంకుశ విధానాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అనేకసార్లు స్పష్టమైనది.