మథుర ఘర్షణల్లో అసలు కోణం "ఆస్తి"
posted on Jun 6, 2016 11:05AM
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి 29 మంది పోలీసుల మృతికి కారణమైన మథుర ఘర్షణల గురించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. మనిషి ఎంత కష్టపడినా డబ్బు కోసమే..తన తరువాతి తరాలు హాయిగా కాలు మీద కాలేసుకుని నిశ్చింతగా గడపాలని నీతిగానో..అవినీతిగానో కోట్లు వెనకేస్తుంటాడు. అలాంటి డబ్బు అప్పనంగా వస్తుంటే ఎవడు మాత్రం వద్దంటాడు చెప్పండి. తనకే దక్కుతుందనుకున్న ఆస్తి..తీరా వేరే ఎవరికో దక్కితే ఎలా ఉంటుంది. ఆ మనిషి ఆగ్రహంతో ఊగిపోడు. దానికి పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందనడానికి మథుర జవహర్‌బాగ్ పార్క్ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.
1975..జనవరి 13 కాన్పూర్ నగరంలోని నానా పార్క్‌లో ఓ ర్యాలీ జరగాల్సి ఉంది. ఆ ర్యాలీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాల్గొంటారంటూ అంతకు ముందే నగరమంతా ప్రచారం జరిగింది. కానీ అప్పటికి 30 ఏళ్ల క్రితమే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని అందరికి తెలుసు. కానీ నేతాజీ బతికే ఉన్నారని ఆయన అనుచరులు వాదిస్తూ వస్తున్నారు. దీంతో నేతాజీని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పార్క్‌కు వెళ్లారు. తెల్ల గడ్డంతో తెల్లబట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు వేదిక ఎక్కాడు.. నేనే సుభాష్ చంద్రబబోస్‌నని ప్రకటించాడు. అంతే ఆయన మరో మాట మాట్లాడకుండా జనం ఆ పెద్దాయనపై చెప్పులు, రాళ్లు, కుళ్లిన గుడ్లు విసిరారు. ఆ టైంలోనే దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో గురుదేవ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అధికారం కోల్పోయాక స్వయంగా ఇందిరాగాంధీ ఆ ఆశ్రమానికి వెళ్లి తనను క్షమించమని వేడుకున్నారు.
ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చారంటే ఆయన దగ్గర అంత శక్తి ఏముంది అనుకుంటున్నారా..? ఆయన ఒక బాబా. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి..గురువును అన్వేషించుకుంటూ ఇల్లొదిలి పోయాడని, ఆలీగఢ్‌లో గురెలాల్ శర్మ అనే రుషిని కలిసి జీవిత పరమార్థం తెలుసుకున్నాడని ఆయన శిష్యులు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత అనేక ఆశ్రమాలు నెలకొల్పి భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు. అనంతర కాలంలో "దూరదర్శి" పార్టీ పెట్టి శాకాహారులనే అభ్యర్థులుగా నిలబెడతానని గురుదేవ్ ప్రకటించాడు. అయితే వరుస ఓటములు పలకరించడంతో రాజకీయాలు మనకు సరిపడవని ఆథ్యాత్మిక ప్రవచనాలకే పరిమితమయ్యాడు. అయితే మథుర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమి ఆక్రమణలో ఉన్నదని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆ భూమిలో అక్రమ తవ్వకాలు సాగిస్తూ విలువైన పురాతన విగ్రహాలను దొంగిలిస్తున్నారని పురావస్తు శాఖ ఆరోపించింది. ఈ క్రమంలో 116 వయస్సులో 2012లో జైగురుదేవ్ మరణించారు. ఈ భక్తి ముసుగులో ఆయన వేలకోట్ల రూపాయలు పొగేశారని ఆరోపణలున్నాయి. ఢిల్లీ-మధుర హైవేపైనా, ఇటావా జిల్లాలో పలు విలాసవంతమైన ఆశ్రమాలు, రూ. 150 కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు ఇలా జైగురుదేవ్‌కు యూపీ సహా దేశవ్యాప్తంగా 12 వేల కోట్ల ఆస్తులున్నట్లు తేలింది. ఆయన మరణానికి ముందే తన డ్రైవర్ పంకజ్ యాదవ్‌ను తన వారసుడిగా ప్రకటించారు.
దీంతో జైగురుదేవ్ అనుచరుడిగా ఉన్న రాంవృక్ష యాదవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆస్తులపై పట్టు సాధించేందుకు జవహర్‌బాగ్ పార్క్‌ను తన అడ్డాగా చేసుకున్నాడు. వెయ్యి మందితో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశాడు. దీని పేరే "ఆజాద్ భారత వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి". దీని సాయంతో పంకజ్‌ను అంతమెందించి, అతని నుంచి జైగురుదేవ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే రాంవృక్ష యాదవ్ ప్రధాన లక్ష్యం. ఇయనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అక్కడకు మారణాయుధాలు తెస్తున్నా, బాంబులు పోగేసుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు. ఇంత చేసుకున్నా చివరికి రాంవృక్ష యాదవ్‌కు చావే మిగిలింది. పోలీసులను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సిలిండర్లను పేల్చారు. ఆ పేలుళ్లలో యాదవ్ మరణించినట్టు పోలీసులు నిర్థారించారు. ఇలాంటి వ్యక్తులను అదుపు చేయకపోతే ఏమవుతుందో మథుర ఉదంతం నిరూపించింది. దీనిని గుణపాఠంగా భావించి సంఘానికి చీడ పురుగుల్లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.