వివాదాల డ్రీమ్‌గాళ్..
posted on Jun 4, 2016 9:48AM
హేమామాలిని..తన నాట్యంతో..అభినయంతో బాలీవుడ్‌ను శాసించి..70 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో ప్రేక్షకుల హృదయాల్లో డ్రీమ్‌గాళ్‌గా చెరగని ముద్రవేశారు హేమ. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగానూ ఎంపికయ్యారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో మధుర ఎంపీగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా జాతీయ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పోరేషన్‌కు ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. కాని ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇటీవలి కాలంలో హేమామాలిని ప్రవర్తిస్తున్న తీరు ఆమెకు వివాదాలను తెచ్చిపెడుతున్నాయి.
జులై 3, 2015న జైపూర్‌లోని దౌసా ప్రాంతంలో అర్థరాత్రి హేమామాలిని ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఓ ఆల్టో కారును వేగంగా ఢీకొట్టడంతో ఆల్టో నుజ్జు నుజ్జయ్యింది. ఆల్టోలో ప్రయాణిస్తున్న హర్ష్ కండేల్వాల్, శిఖా, సీమ, మరో ఇద్దరు చిన్నారులు సోమిల్, సోనమ్ అనే పేర్లు గల ఐదుగురు కుటుంబసభ్యులు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. ఇక బెంజ్ కారులో ప్రయాణిస్తున్న హేమకు ముఖం మీద గాయాలయ్యాయి. హేమమాలినికి ప్రమాదం జరిగిందన్న వార్త దావానంలా నగరమంతా వ్యాపించింది. ప్రమాద స్థలానికి బీజేపీ నేతలు పరుగు పరుగున వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించి. ఆల్టో కారులో ఉన్నవారిని గాలికొదిలేశారు. ఆ ఐదురుగు తీవ్రగాయాలతో దాదాపు అరగంటపాటు రోడ్డుమీదనే తమను రక్షించేవారి కోసం ఎదురుచూశారు.
చివరకు కొందరు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే సోనమ్ అనే చిన్నారి చనిపోయింది. ఆ చిన్నారిని రక్షించే అవకాశం ఉండి కూడా హేమ తన ప్రాణం తాను చూసుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరగడం..సోషల్ మీడియాలో హేమను విమర్శించడంతో సర్దుకున్న డ్రీమ్‌గాళ్ చనిపోయిన చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. కాని అందులో ఎక్కడా తాను తప్పు చేసినట్టు పశ్చాత్తాపం ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు.
ఆ తర్వాత తన నియోజకవర్గంలోని బాన్సిబట్ అనే గ్రామ పర్యటనకు వచ్చిన హేమమాలిని ఆ గ్రామ సర్పంచ్‌పై నోరు పారేసుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ ప్యూన్‌గా కూడా పనికిరాదని మండిపడ్డారు. అకారణంగా తమను తప్పు పడుతూ అవమానించడంతో హేమమాలిని తీరుకు నిరసనగా ఆ గ్రామస్తులు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసి హేమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా హేమమాలినిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్ని జరిగినా అమ్మగారి తీరు మారలేదు.
మధురలోని జవహర్‌బాగ్ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును రెండేళ్ల క్రితం స్థానికులు అక్రమించుకున్నారు. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానాల ద్వార ప్రయత్నిస్తున్నప్పటికి సాధ్యం కాలేదు. అయితే నిన్న పోలీసులు ఆ పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కాల్పులు జరిపారు...అయితే ఆందోళనకారుల వద్ద కూడా ఆయుధాలు ఉండటంతో వారు కూడా పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు. ఆ సమయంలో గ్యాస్ సిలిండర్లు పేలడం, కాల్పుల కారణంగా ఎస్పీ సహా 21 మంది పోలీసు సిబ్బంది మరణించారు. పరిస్థితి ఇంత బీభత్సంగా ఉన్నా స్వయంగా ఆ నియోజకవర్గానికి ఎంపీ అయిన హేమ ఆ ప్రాంతాన్ని సందర్శించాల్సింది పోయి..తీరిగ్గా షూటింగ్‌లో పాల్గొన్నారు. పైగా ఆ సమయంలో తాను లాంచీ ఎక్కుతున్న ఫోటోలను మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్ విమర్శలతో దద్దరిల్లిపోయింది. మథుర కాలిపోతుంటే..ఈ సంబరాలు ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే మేల్కొన్న హేమమాలిని..ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు.
పైన జరిగిన అన్ని సంఘటనల్లోనూ హేమమాలిని ఒక సెలబ్రిటీగా..ఘనత వహించిన పార్లమెంట్ మెంబర్‌గా అన్నింటి కన్నా ముఖ్యంగా మామూలు మనిషిగా కూడా విఫలమయ్యారు. హేమ నటించిన సినిమాలు చూసి వాటిని ఆదరించి ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన ప్రజలు కష్టాల్లో ఉంటే వారి పట్ల కనీస కృతజ్ఞత లేకపోవడం దారుణం. తమ జీతాలు, తమ బత్యాలు, తమ సౌకర్యాలు, తమ స్వార్థం తప్ప ప్రజల గురించి ఆలోచించని ప్రజాప్రతినిధులు రాజ్యమేలుతున్న మనదేశంలో..ఇక సినీ మాయా ప్రపంచంలోంచి వచ్చిన హేమామాలిని లాంటి వాళ్ల నుంచి ఇంతకంటే మనం ఎక్కువగా ఆశించలేం.