తెలుగుదేశం వైపు మర్రి రాజశేఖర్ చూపు!

వైసీపీ భవిష్యత్ పట్ల ఆ పార్టీ నాయకులు ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీ కీలక నేతలంతా జగన్ కు దూరం జరుగుతూ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బుధవారం (మార్చి 20) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీని కూడా వీడతాననీ, తన కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశం గూటికి చేరతాననీ ప్రకటించారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఇప్పటి వరకూ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. మర్రి రాజశేఖర్ కంటే ముందు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంటకరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు తాజాగా రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే.. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన వైసీపీ తరఫున విజయం సాధించారు. చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఇండిపెండెంట్ గా విజయం సాధించిన మర్రి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు.  ఇక 2019 ఎన్నికలలో ఆయన చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019లో చిలకలూరి పేట స్థానం నుంచి విడదల రజనీని జగన్ రంగంలోకి దింపారు. అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోనైనా మర్రి రాజశేఖర్.. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, కేబినెట్ లోకి తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు.  

అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ ఇచ్చిన హామీ మేరకు మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం 2023 వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలలో మర్రికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మర్రి రాజశేఖర్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. కాగా రాజీనామా చేయవద్దంటూ జగన్ రాయబారాలు పంపినా మర్రి ఖాతరు చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మర్రి రాజీనామా చేయవద్దంటూ ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.