కపిల్‌‌‌దేవ్‌కి బాక్సింగ్ పంచ్ పడింది...

 

2010 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన బాక్సర్ మనోజ్‌కుమార్‌కి అప్పట్లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు ఇవ్వాలని సంకల్పించింది. అప్పుడు అర్జున అవార్డుల కమిటీకి కపిల్‌దేవ్ ఛైర్మన్‌గా వుండేవాడు. కపిల్‌దేవ్ అర్జున అవార్డుల లిస్టు నుంచి మనోజ్ కుమార్ పేరును తొలగించాడు. ఎందుకయ్యా అంటే, మనోజ్ కుమార్ గతంలో డ్రగ్స్ వాడినట్టు, డోప్ టెస్ట్‌లో దొరికిపోయినట్టు తనకు తెలుసని, అందుకే మనోజ్ కుమార్ పేరును లిస్టు నుంచి తొలగించానని చెప్పాడు. దాంతో మనోజ్‌కి అర్జున అవార్డు రాలేదు. ఈ విషయం విని హతాశుడైన మనోజ్ కుమార్ డ్రగ్స్ వాడిన మనోజ్ కుమార్ తాను కాదని, మరో మనోజ్ కుమార్ వున్నాడని చెప్పడం కోసం కపిల్‌దేవ్‌కి ఫోన్ చేశాడు. అయితే కపిల్‌దేవ్ మనోజ్‌తో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ, ‘‘ఎవర్నువ్వు?’’ అని ఫోన్ పెట్టేశాడు. అయితే బాక్సర్ మనోజ్ కుమార్ అక్కడితో ఆగకుండా కోర్టును ఆశ్రయించాడు. తనను అన్యాయంగా అర్జున అవార్డుల లిస్టు నుంచి కపిల్ దేవ్ తప్పించాడని ఫిర్యాదు చేశాడు. కోర్టు ఈ కేసును విచారించి, డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోయిన మనోజ్ మరో వ్యక్తి అని తేల్చింది. దాంతో ప్రభుత్వం మనోజ్ కుమార్‌కి అర్జున అవార్డును ప్రదానం చేసింది. బుధవారం నాడు కేంద్ర క్రీడాశాఖ మంత్రి  సోనోవాల్ నుంచి మనోజ్ కుమార్ అర్జున అవార్డును స్వీకరించాడు. ఆ తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడుతూ కపిల్ దేవ్‌కి చురకలు అంటించాడు. ‘‘మిస్టర్ కపిల్‌దేవ్.. అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తే నువ్వెవరు? అని ప్రశ్నించావ్.. ఈరోజు మళ్లీ చెబుతున్నా.. నేను మనోజ్‌ను. ఇదిగో.. అర్జున అవార్డు గ్రహీతను’’ అన్నాడు. ఇది నిజంగా కపిల్‌దేవ్‌కి ఒక షాకే.