నారా వారి ప్రాపకం కోసం మంచు వారి వెంపర్లాట.. వద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు!

మంచు కుటుంబంలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. అన్నదమ్ముల ఆస్తుల వివాదం కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయే వరకూ దారి దీసింది. మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్ ఒక వైపు అన్నట్లుగా కుటుంబం చీలిపోయింది. పలు మార్లు దాడులు, ప్రతి దాడుల వరకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు, అటు మంజు విష్ణు కూడా రాజకీయ అండ కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు, అండ కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో  ప్రదర్శించిన ప్లెక్సీల్లో మోహన్ బాబు ఫొటోతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా ఉంది. 

వాస్తవానికి మోహన్ బాబుకు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవు. జగన్ హయాంలో మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చంద్రబాబుపైనా, తెలుగుదేశంపైనా ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.  సరే జగన్ కోసం ఎంతగా పని చేసినా, 2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో అప్పటి తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలూ నిర్వహించినా జగన్ నుంచి మోహన్ బాబుకు ఎటువంటి ప్రశంసా రాలేదు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మోహన్ బాబుకు ఏదో కీలక కార్పొరేషన్ పదవి, రాజ్యసభ సభ్యత్వం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతే. జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు.

 దీంతో విసిగి వేసారిన మోహన్ బాబు జగన్ కు దూరం జరిగారు. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం చేయలేదు సరికదా.. ఎన్నికల ముందు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చివరికి అదీ జరగలేదు. ఇక గత కొంత కాలంగా మోహన్ బాబు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. అయితే అదేమీ ఆయన నటనావైదుష్యం కారణంగానో, విద్యాసంస్థల అధినేతగా వచ్చిన పేరు ప్రతిష్ఠల కారణంగానో కాదు, కుటుంబ గొడవలలొ వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా ఆయన వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. జర్నలిస్టుపై దాడి కేసులో అరెస్టును తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లిన కారణంగా వార్తల్లో నిలిచారు.  

అలాగే ఆయన విద్యాసంస్థల విషయంలో  ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ విద్యా సంస్థలలో ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ బాబు విద్యాసంస్థపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు చంద్రబాబుతో గతంలో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుని ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో చంద్రబాబు ఫ్లెక్సీల ప్రదర్శన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఊసరవిల్లి సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తున్నారనీ, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న చందంగా మోహన్ బాబు వ్యవహార శైలి ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మరో వైపు తండ్రితో, సోదరుడు విష్ణుతో విభేదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ కూడా చంద్రబాబుకు దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కనుమ పండుగ రోజున మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారా వారి పల్లె వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.  
మోహన్ బాబు కుటుంబం ఇలా చంద్రబాబు, లోకేష్ మద్దతు కోసం పాకులాడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం వీరి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచు కుటుంబాన్ని చంద్రబాబు, లోకేష్ దూరం పెట్టడమే మంచిదన్న అభిప్రాయాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.