న్యూఢిల్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్
posted on Jan 15, 2025 2:15PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆప్ అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం (జనవరి 15) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు ఆలోచించి, పని చేసే వారికే ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.
కష్టపడి పని చేసే వారికే ప్రజలు ఓటు వేస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 17 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది. ఈ ఎన్నికలలో బీజేపీ, ఆప్ ను హోరాహోరీ తలబడుతుండగా, కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది.