మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూలు విడుదల!
posted on Oct 15, 2024 4:48PM
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ రెండు రాష్ట్రాల పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు ఒకే ఒక దశలో, ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరపనున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 బుధవారం పోలింగ్ జరుగుతుంది. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు దేశంలో ఖాళీగా వున్న రెండు పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూలు విడుదలైంది. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతోపాటు 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న, నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు ఉత్తరాఖండ్‌లోని ఒక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీకి నవంబర్ 26వ తేదీతో గడువు ముగియనుంది. ఝార్ఖండ్ ప్రస్తుత అసెంబ్లీ గడువు జనవరి 5వ తేదీతో ముగియనుంది.
మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో మొత్తం 288 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 234 జనరల్ సీట్లు, 25 ఎస్టీ, 29 ఎస్సీ స్థానాలు వున్నాయి. 2024 అక్టోబర్ 15 నాటికి మొత్తంగా 9.63 కోట్లమంది ఓటర్లున్నారు. వీరిలో 4.97 మంది పురుషులు కాగా, 4.66 మంది స్త్రీలు. మొత్తం ఓటర్లలో 1.85 కోట్లమంది 20 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసు వున్నవారు. 20.93 లక్షలమంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 1,00,168 పోలింగ్ కేంద్రాలు వున్నాయి.
ఝార్ఖండ్‌లోని 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు వున్ానయి. వీటిలో 44 జనరల్ స్థానాలు, ఎస్టీకి 28, ఎస్సీకి 9 స్థానాలు వున్నాయి. మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.29 మంది పురుష ఓటర్లు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు. 11.84 లక్షలమంది ఓటర్లు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.