మహా పొలిటికల్ థ్రిల్లర్.. ఇంకా వుంది

అనుకోకుండా .. ఒక రోజు .. ఇది ఒక థ్రిల్లర్ సినిమా టైటిల్... సినిమా  అంతా అనూహ్య సంఘటనలో మలుపులు తిరుగుతూ సాగుతుంది. మహారాష్ట్ర రాజకీయాలు .. అంతకంటే  చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతూ వచ్చాయి, చివరకు అనుకోకుండా, అనూహ్యంగా, శివసేన తిరుగబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహరాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఇంకా అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ .. అయిష్టంగానే అయినా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ప్రభుత్వంలో చేరడం లేదని స్వయంగా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఫడ్నవీస్ చివరి క్షణంలో,ఢిల్లీ ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మహా డ్రామాను మరో మలుపు తిప్పిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విధంగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (ఎంవిఎస్) ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన శివసేన రెబెల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటులో మొదలైన మహా రాజకీయం,అదే షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఒక ముగింపుకు వచ్చింది. అయితే ఇక్కడితో, మహా డ్రామా ముగింపుకు చేరునట్లేనా? అంటే .. లేదు.  అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది అన్నట్లుగా పరిణామలు  వేగంగా మారుతున్నాయి సంకేతాలు స్పష్టమవుతున్నాయి.  

అందరూ అనుకున్నట్లుగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేసి ఉన్నట్లయితే, నిజంగానే, కథ అక్కడితో ముగిసేది కావచ్చును, కానీ, మహా మహులు, రాజకీయ పండితులకు  కూడా అంతు చిక్కని విధంగా,   అనూహ్య మలుపు తీసుకుని బీజేపీ షిండేను ముఖ్యమంత్రిని చేయడంతో  కథ కొత్త మలుపు తీసుకుంది. అంతే కాదు, చివరి క్షణంలోనూ అనుకో కుండా .. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మహా డ్రామా మరో ట్విస్ట్ తీసుకుంది. 

అయితే ఈ అనూహ్య పరిణామాలకు కారణం ఏమిటి? ఇది ఎవరి వ్యూహం? ఎందుకిల జరిగింది? అని ఆలోచిస్తే, ఒకటి కాదు, చాల కారణాలు కనిపిస్తున్నాయి, అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అంటే, బీజేపీ జాతీయ నాయకత్వం, అంటే మోడీ, షా, జోడీ, నడ్డా ట్రియో పక్కాగా, స్క్రిప్ట్ దగ్గర పెట్టుకుని ‘స్క్రీన్ ప్లే’ ప్రకారం కథ నడిపించారు. నిజానికి, నెక్స్ట్ సీన్’లో  ఏమి జరుగుతోందో, చివరకు  ఫడ్నవీస్’ కు కూడా తెలియకుండా కథ నడిపించారు. అందుకే, మహామహులు, మహా మేథావులు అనుకున్న రాజకీయ పండితులకు కూడా ఏమి జరుగుతోంది,అనేది జరగవలసింది జరిగే వరకు అంతుచిక్కలేదు. చివరకు షిండే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, ఫడ్నవీస్’ కూడా వేదిక ఎక్కుతారా అనేది స్టేజి మీద కుర్చీల లెక్కను బట్టి మీడియా నిర్దారించుకుంది, అంటే ‘ఢిల్లీ ట్రియో’ ఎంత పక్కాగా కథ నడిపించారో అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే, ఈ మధ్య కాలంలో ఇంతలా రక్తి కట్టిన పొలిటికల్ డ్రామా చూడలేదనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 
ఇంచుమించుగా పదిరోజులకు పైగా సాగిన మహా డ్రామాలో, బీజేపీ జాతీయ నాయకులు ఎవరూ చివరి వరకు కూడా తెర మీదకు రాలేదు, అసలు, బీజేపీ పాత్రే లేదని, షిండే తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారం అనే చెప్పుకుంటూ వచ్చారు.

అయిన, ఎవరు నమ్మలేదనుకోండి, అది వేరే విషయం. అయితే,  ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆదేశం మాత్రం, బీజేపీ జాతీయ అద్యక్షు నడ్డా ఆన్ స్క్రీన్ చేశారు. వీడియో విడుదల చేశారు.  ఆ వెంటనే అమిత్ షా, మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ఫడ్నవీస్ పార్టీ ఆదేశాలను అమలు చేశారని, ఆయన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అంటే, నో ‘ ముఖ్యమంత్రిగా చేసిన నేను, ఉప ముఖ్యమంత్రిగా చేయడం ఏమిటి? అని అనకుండా  .. అనే అవకాశం ఫడ్నవీస్’కు లేకుండా నడ్డా, షా ఇద్దరూ ఫడ్నవీస్ ఉచ్చులో బిగించారు.  ఇరికించారు, అందుకే ఆయన అయిష్టంగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక తప్పలేదు. 

అదలా ఉంటే, బీజేపీ జాతీయ నాయకత్వం, అనేక కోణాల్లో ఆలోచించే కథ నడిపించింది అంటున్నారు. ఇందులో ఫస్ట్ స్టెప్, మహా వికాస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడమే  అయినా, శివసేన ఆక్రమించిన పొలిటికల్ స్పేస్’ను పూర్తిగా కబ్జా చేయడమే అంతిమ లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు. మహారాష్ట్రలో శివసేనను దెబ్బకొట్టడం ఎంత ముఖ్యమో.. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ థాక్రే కుటుంబం సమీప భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా చేయాలన్నదే బీజేపీ అసలు వ్యూహంగా పరిశీలకులు భావిస్తున్నారు.అందులో భాగంగా ముందుగా త్వరలో జగనున్న బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలలో ఉద్ధవ్ సేనను తుడిచేసేందుకే, షిండేను సీఎం చేసిందని అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం ద్వారా బీజీపీ అధికార దాహంతో వరసపెట్టి ప్రభుత్వాలను కూల్చివేస్తోందని అపవాదు నుంచి తప్పుకునేందుకు కూడా, శివసేన చీలిక వర్గానికి అధికారం ఇచ్చిందని అంటున్నారు. అయితే ఇక్కడితో మహా డ్రామాకు తెర పదినట్లేనా, అంటే, లేదు .. చెప్పాల్సింది చాలా వుంది .. చూడాల్సింది మిగిలే ఉందని అంటున్నారు.