మాధవీలతకు బీజేపీ నేతల మద్దతు కరవు

హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. 1984 నుంచి ఇప్పటి వరకూ హైదరాబద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సలావుద్దీన్ ఒవైసీ, ఆయన తరువాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదు. అయితే ఈ సారి హైదరాబాద్ లో బీజేపీ పాగా వేసేందుకు ఒకింత సానుకూల వాతావరణం ఉందన్న అంచనాలు ఏర్పడ్డాయి.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ తో అంటకాగిన ఎంఐఎం పట్ల నియోజకవర్గ ప్రజలలో ఒకింత అసంతృప్తి ఉందని బీజేపీ భావిస్తోంది. దీంతో  ఈ సారి ఎలాగైనా హైదరాబాద్ లోక్ సభ స్థానంలో విజయం సాధించాలన్న పట్టుదలతో  బీజేపీ అడుగులు వేస్తున్నది. అయితే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో మాత్రం బీజేపీ హై కమాండ్ తప్పుటడుగు వేసిందని పార్టీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. స్థానిక నేతలెవరినీ సంప్రదించకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిఫారసు మేరకు మాధవీలతకు పార్టీ టికెట్ కేటాయించడంతో పోటీ జరగకుండానే పార్టీ పరాజయం ఖరారైపోయిందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నది. 

పార్టీ అభ్యర్థిగా మాధవీలత ప్రచార కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర నాయకులెవరూ కనిపించడం లేదు. ఆమె కొద్ది మంది తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో ప్రచారం నిర్వహించుకుంటున్నారు.  అసలు మాధవీలత అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించిన వెంటనే పార్టీ నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. బీజేపీ ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. పార్టీకి హైదరాబాద్ లో పోటీ చేయడానికి మగాళ్లే దొరకలేదా అని ఘాటు విమర్శలు సైతం చేశారు. వాస్తవానికి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజాసింగ్ టికెట్ ఆశించారు. అయితే ఎవరినీ సంప్రదించకుండా బీజేపీ హైకమాండ్ ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకూ మాధవీలత తరఫున ప్రచారంలో పాల్గొనలేదు.

అలాగే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచీ గుర్తింపు ఉన్న నాయకులెవరూ మాధవీలతకు మద్దతు పలికిన దాఖలాలు లేవు. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాధవీలత కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం (మార్చి 29) సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలెవరూ హాజరయ్యే అవకాశాలు లేవని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మాధవీలత అభ్యర్థిత్వం విషయంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల అసంతృప్తి అధిష్ఠానం బుజ్జగింపులతో తగ్గిపోయే పరిస్థితులు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కనీసం పార్టీ సభ్యురాలు కూడా కాని మాధవీలతకు పార్టీ టికెట్ ఇచ్చి మరీ పార్టీ కండువా కప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఎంఐఎంకు బీజేపీ ఏ మేరకు పోటీ ఇవ్వగలుగుతుందన్నది అనుమానమేనని అంటున్నారు.