ఒలింపిక్స్ లో లవ్లీనాకు కాంస్యం.. భారత్ కు మూడో పతకం

టోక్సో ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. ఇప్పటివరకు రెండు పతకాలు రాగా.. అవి రెండు కూడా మహిళా ప్లేయర్లే అందించారు. వెయిట్ లిఫ్టింగులో మీరాబాయ్ చానుకు రజత పతకం రాగా.. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు కాంస్యం వచ్చింది. తాజాగా బాక్సింగులో లవ్లీనా బోర్గోహెయిన్ ఇండియాకు బ్రాంజ్ మెడల్ అందించింది. 

ఒలింపిక్స్ లో ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్.. అద్భుతంగా ఆడి  కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64–69 కిలోలు) విభాగంలో బరిలో నిలిచిన ఆమె.. సెమీ ఫైనల్ లో ఓడిపోయింది.   టర్కీకి చెందిన బిజెనెజ్ సర్మినెలి చేతిలో ఓటమిపాలైంది. జడ్జిలంతా ఏకగ్రీవంగా బిజినెజ్ ను విజేతగా ప్రకటించారు. మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థి బిజినెజ్ పంచ్ ల వర్షం కురిపించింది. 5–0తో ముందంజ వేసింది. తర్వాతి రౌండ్ నుంచి బోర్గోహెయిన్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఏకగ్రీవంగా బిజెనెజ్ ను విజేతగా ప్రకటించారు. ఫలితంగా గెలుపోటములతో సంబంధం లేకుండా లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని గెలిచింది.
 
విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్ కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. కంచు పతకం సాధించిన లవ్లీనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లవ్లీనాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. లవ్లీనా విజయం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు ప్రధాని.  లవ్లీనా బోర్గోహెయిన్ ఒలింపిక్స్ పతకం సాధించడంతో... ఆమె సొంతూకు అసోంలోని ఓ మారుమూల పల్లెలో సంబరాలు జరుగుతున్నాయి. లవ్లీనా పల్లెకు ఇప్పటివరకు కనీసం రోడ్డు కూడా లేదు. కాని రెండు రోజుల క్రితమే అధికారులు యుద్ద ప్రాతిపదికన ఆ గ్రామానికి రోడ్డు నిర్మించారు.