పార్లమెంటు నియోజకవర్గాల పెంపు ఎప్పుడంటే?

లోక్ సభ స్థానాలు పెరగనున్నాయా? అంటే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ  చేసిన ప్రకటన వింటే ఔననే అనాల్సి ఉంటుంది. త్వరలో పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు.

లోక్ సభ, రాజ్యసభ స్థానాలు పెరగనున్నాయనీ, కొత్త పార్లమెంటు భవనంలో అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.   నూతన పార్లమెంట్ భవనలో లోక్ సభలో  888 మంది రాజ్యసభలో 384 మంది కూర్చోవడానికి వీలుగా సీటింగ్ అరేంజ్ మెంట్ చేసినట్లు మోడీ వివరించారు.  అయితే 2026 నాటికి పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అది జరిగితే..  ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి మరో 150 వరకూ అంటే  693 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కనుక అందుకు అనుగుణంగా  రాజ్య సభ సీట్లు కూడా పెరుగుతాయి.

 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా  తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు నకు ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేరలేదు. గతంలో పలు మార్లు తెలుగు రాష్ట్రాల్లో నియోజవర్గాల పెంపు ప్రక్రియ కసరత్తు షురూ అయ్యిందంటూ అప్పటి  రాజకీయ పరిస్థితులను బట్టి బహుముఖంగా ప్రచారం జరిగింది.  

విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.  రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్య  153 కు పెరగాల్సి ఉంది. గతంలో పలుమార్లు  తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు  పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే..  పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరిగింది.

అయితే అదంతా ప్రచారానికే పరిమితమైంది. ఆ తరువాత ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు తెలుగురాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు 2031 వరకూ ఉండే అవకాశం లేదని కేంద్రం విస్పష్టంగా బదులిచ్చింది.   కానీ కాశ్మీర్ లో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన కేంద్రం తెలుగు రాష్ట్రాలపై మాత్రం శీతకన్నేసింది.