సన్నద్దానికి పలు మార్గాలు!

ఎల్. కె.జీ బుడ్డోళ్ల నుండి గ్రూప్స్, సివిల్స్ టార్గెట్ గా ఉన్న యంగ్ డైనమిక్స్ వరకు అందరికీ ఈ కాలంలో పరీక్షల గోల తప్పదు, పుస్తకాలు పట్టుకుని చదవడం అంతకన్నా తప్పదు. ఒకప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు బెత్తం పట్టుకుని, ముందు కూర్చుని పిల్లలకు చదివించేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చదువుకొని ఎక్సమ్స్ బాగా రాయిరా బాబు నీకు కావలసింది కొనిస్తాం అని లంచాల ఆశ చూపిస్తారు. ఇదంతా పిల్లొళ్ల గోల.

మరి పెద్దోళ్ళ గోల సంగతేంటి??

బుక్ తీస్తే పక్కనే ఉన్న మొబైల్ టింగుమని వాట్సాప్ లేదా fb మెసేజ్ అలర్ట్ ఇస్తుంది. మొబైల్ ను దూరంగా పెట్టేసామా కుంకుమపువ్వొ, కార్తీక దీపమో లేక ఇంకా వేరే ఛానెల్స్ పేర్లయినా పెటుకొండి వాటి తాలుకూ డైలాగులు హింసగా సాగిపోయే సెంటమెంట్లు, పిన్ చేంజ్ పెన్సిల్ లాగా పైకి కిందకి ఎక్కి దిగుతూనే ఉంటాయి. వాటి గోల ఒకటి.

పోనీ అవి కూడా లేనప్పుడు, మొబైల్  దూరంగా ఉన్నప్పుడు, చదువుకోడానికి ఇంటరెస్ట్ పుట్టినప్పుడు అప్పుడే ఇంట్లో అమ్మ, లేదా నాన్న టింగుమని పిలిచి బయట షాపుకెళ్లి ఏదో ఒకటి తెమ్మని చెబుతారు. 

ఇలా యూత్ కు మా చెడ్డకాలం నడుస్తూ ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి ఒక్కొరు ఒకో దారి ఎంచుకుంటారు, వాటిని ఫాలో అవుతారు. 

ఇంతకూ ఏంటవి??

ఫ్రెండ్స్ తో గ్రూప్ స్టడీ!!

ఇందులో బాగుపడటానికి ఎంత అవకాశం ఉంటుందో, చెడిపోవడానికి అంతే అవకాశం ఉంటుంది. చదువుకోవాల్సిన టైమ్ లో చదువుకోకుండా  మూడు కోతులు కలిసి నాలుగో కోతిని కూడా చెడగొట్టినట్టు కాస్తో, కూస్తో చదవాలనే ఇంటరెస్ట్ ఉన్నోడు కూడా నాశనం అయిపోతాడు. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ కావాలని అనుకున్నవాళ్ళు కలసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ చదివితే చాలా కొద్ది సమయంలోనే బోలెడు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. పైగా ఒక్కొక్కరు ఒకో బుక్ తెచ్చుకుని నలుగురు డిస్కస్ చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. కావాల్సిందల్లా సీరియస్నెస్ మాత్రమే. 

ఏకాంతం!!

చాలామంది బుక్స్ ఎత్తుకుని ఏ పార్క్ కో, లేక ఏ చెట్ల కిందకో వెళ్ళిపోతారు. అబ్బాయిలకు ఈ మార్గం బాగానే ఉంటుంది. కానీ అమ్మాయిలకు ఇబ్బంది. సెక్యూరిటీ ఉండదు. పైగా ఏదైనా వేరే బుక్ లేదా నోట్స్ లాంటివి అవసరం అయితే తిరగడానికి టైమ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సైకిల్, బైక్ ల మీద వెళ్లే వాళ్లకు ఇది కొంచెం బెస్ట్.

లైబ్రరీ!!

అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఇదే. ఎలాంటి భయం ఉండదు, బుక్స్ చేతుల్లో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. న్యూస్పేపర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి హాయిగా రెగులర్ కరెంట్ అఫైర్స్ తో పాటు జనరల్ నాలెడ్జ్ రౌండ్ కొట్టేయచ్చు. అలాగే పోటీ పరీక్షలకు కావల్సిన ఎన్నో బుక్స్ లైబ్రరీలలో ఉంటాయి కాబట్టి చక్కగా చదివేసుకోవచ్చు. అనవసర చర్చలు, మాటలు లేకుండా కీప్ సైలెన్స్ బోర్డ్ ఉంటుంది కాబట్టి ఏ గోలా లేకుండా హాయిహయిగా ఇంటరెస్ట్ గా చదివేయచ్చు.

ఇలా ఒకటికి మూడు మార్గాలతో నచ్చిన దారిలో పుస్తకాలతో కుస్తీ పడితే పరీక్షల అంతు చూడచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎలిజిబుల్ ఎక్సమ్ కావచ్చు. అన్నిటినీ చీల్చి చెండాటమే కావలసింది. 

అయితే ఓ మాట. చదివే ముందు మరీ ఫుల్లుగా తినద్దు, తినకుండా చదువులో మునగద్దు, తాగడానికి ఒక మంచినీళ్లు బాటల్ దగ్గరే పెట్టుకోండి. ఇక బస్ చదుకోండి!!

                               ◆వెంకటేష్ పువ్వాడ.