వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం!?

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నేతలు, శ్రేణులలో జగన్ నాయకత్వంపై విశ్వాసం సడలుతోంది. ఓటమిని హుందాగా అంగీకరించడం పోయి.. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టీ పట్టగానే ఆ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ హస్తినకు వెళ్లి మరీ ధర్నా చేసి రావడాన్ని ఆ పార్టీలోనే మెజారిటీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఒకరి వెంట ఒకరుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తూ రాజీనామాల బాట పట్టారు.

గత వారం రోజులుగా ప్రతి రోజూ ఎవరో ఒక నేత వైసీపీకి రాజీనామా చేసిన వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా పార్టీకి దూరం అవుతున్నారు. పార్టీ అధినేత జగన్ తీరు పట్ల అసంతృప్తితోనే పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి మరీ రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఘోర పరాజయానికి కారణమైన అంశాలపై సమీక్ష చేయడం, ఆత్మవిమర్శ చేసుకోవడం, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజా విశ్వాసం పొందాలన్న ఉద్దేశం లేశమాత్రంగానైనా జగన్ లో కనిపించకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు. ఆ కారణంగానే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పార్టీని ముందుండి నడిపించాల్సిన జగన్  పార్టీని, పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా, ఓట మికి కారణాలపై సమీక్ష నిర్వహించకుండా, అధికారంలో ఉండగా ఎంతో గొప్పగా పాలించాం, అయినా జనం తిరస్కరించారంటూ ప్రజలను నిందిచడం పట్ల పార్టీ నేతలు,   శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్నిబాహాటంగా ప్రకటిస్తూనే రాజీనామాలు చేస్తున్నారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఇద్దరు కీలక నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్,  జిల్లా కోశాధికారి, ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు రాజీనామా చేశారు.

ఈ ఇద్దరు నేతలు   వైసీపీలో కీలకంగా పనిచేశారు. ముఖ్యమైన ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో వీరితో పాటు వీళ్ల అనుచరులు సైతం వైసీపీకి దూరం అయ్యారు.  మరికొందరు సీనియర్లు సైతం జిల్లాలో వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీ విధి, విధానాలు నచ్చకపోవడంతోనే శ్రీనివాస్, మైబాబు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల రాజీనామా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

వాస్తవానికి ఇంకా చాలామంది నాయకులు వైసీపీని వదిలి ఇతర పార్టీల్లో చేరాలనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో  గత్యంతరం లేక ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఒక్కసారి కూటమి పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ దాదాపు ఖాళీ అయిపోతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  నుంచి సిగ్నల్ వస్తే మాత్రం వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.