ఆర్టీసీ సమ్మె వెనుక బీజేపీ వ్యూహం..! లక్ష్మణ్ లేఖతో సర్కారులో కలవరం

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీ... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. తెలంగాణలో బలపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాషాయ పార్టీ... ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ కంటే ముందుగానే స్పందిస్తూ ప్రజామద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలోనూ మొదట్నుంచీ కార్మికులకు అండగా నిలిచిన కమలనాథులు... కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  ఒకవిధంగా చెప్పాలంటే ఆర్టీసీ సమ్మెను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే, ఒకవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు ఉధృతం చేస్తూనే... మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ లూప్ హోల్స్‌ను వెతికి పట్టుకుని కార్నర్ చేస్తోంది బీజేపీ.

తాజాగా ఆర్టీసీ నష్టాలపై టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... కేంద్రానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అసలు, ఆర్టీసీ నష్టాలకు యూనియన్లు, కార్మికులే కారణమని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుంటే.... టీఆర్ఎస్ సర్కార్ వైఖరి వల్లే ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తుంటే.... ఆ ప్రయత్నాలను కేసీఆర్ అడ్డుకున్నారని లక్ష్మణ్ అంటున్నారు. అసలు, ఆర్టీసీ పెట్రోల్ బంకుల్ని... ఇతరులకు అప్పగించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు... లక్ష్మణ్ లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అసలు, ఆర్టీసీ నష్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటోన్న లక్ష్మణ్‌.... కేంద్రం కేటాయించిన పెట్రోల్ బంకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఎంవోయూను అతిక్రమించారని ఆరోపించారు. హెచ్‌పీసీఎల్‌... ఐవోసీతో ఆర్టీసీ చేసుకున్న ఒప్పందాల్లో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయంటోన్న లక్ష్మణ్... వాటిని రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆర్టీసీ భూముల్ని, విలువైన ఆస్తుల్ని, బంకులను నచ్చినవారికి కట్టబెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం... ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ బంకుల్ని ఇతరులకు అప్పగించడం వల్ల... ఆర్టీసీకి రావాల్సిన కమీషన్‌లో 60శాతం ప్రైవేట్‌పరం అవుతోందని, దాంతో సంస్థ నష్టపోతోందని ఆరోపించారు. భూములను ఆయిల్ కంపెనీలకు లీజుకిచ్చి లబ్ది పొందాలని ఆర్టీసీ భావిస్తే, దానికి కేసీఆర్ ప్రభుత్వం గండికొట్టిందని లక్ష్మణ్ మండిపడ్డారు.

ఆర్టీసీకి కేంద్రం కేటాయించిన పెట్రోల్ బంకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక... పెద్ద కుంభకోణం ఉందంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు లక్ష్మణ్‌. అందుకే, ఆర్టీసీకి... ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాలను బయటపెట్టి.... విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఆర్టీసీ పెట్రోల్ బంకులను ఇతరులకు కట్టబెట్టడం దారుణమైన ఉల్లంఘన అంటోన్న లక్ష్మణ్... ఆ డీలర్ షిప్పులను రద్దుచేసి, వాటిని ఆర్టీసీయే నిర్వహించుకునేలా ఆదేశించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను కోరారు లక్ష్మణ్‌. మరి... లక్ష్మణ్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.