రేవంత్ పద్మవ్యూహంలో కేటీఆర్ చిక్కుకున్నారా?

 

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలు గులాబీ దళాన్ని కలవర పెడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు తమ పార్టీలో చేరుతున్నారంటూ బాంబు పేల్చేశారు.ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గజ్వేల్ నర్సారెడ్డి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరుతున్నాడంటూ పెను దుమారం రేపారు.ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకునేలోపు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఎంపీలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు.అయితే రేవంత్ అన్నది నిజమో కాదో అని తెలుసుకోకుండానే ఆ పార్టీ నేత కేటీఆర్ రేవంత్ ట్రాప్ లో పడ్డారు. ప్రచారానికి,పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ విశేశ్వర రెడ్డి, మహబూబాద్ ఎంపీ సీతారాం నాయక్ లను ప్రగతి భవన్ కి పిలిపించి మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది రేవంత్ పొలిటికల్ గేమ్ అని మీడియాకి వివరణ ఇమ్మని కేటీఆర్ ఆదేశించారు.దాంతో ఈ ఇద్దరు ఎంపీలు తమంతట తామే బయటపడ్డారు.

కానీ తాజాగా రేవంత్ రెడ్డి మాత్రం వాళ్లిద్దరే అని నేను చెప్పలేదు కానీ మీరు ప్రగతి భవన్ కి ఎందుకు పిలిపించి మాట్లాడారు.చేరేది కవిత,వినోద్ ఎందుకు కాకూడదు అని టీఆర్ఎస్ పార్టీకి మరోసారి షాక్ ఇచ్చారు. అయితే ఇదంతా రేవంత్ మైండ్ గేమ్ నా లేక నిజంగానే పార్టీ మారటం పక్కానా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఇప్పటికే అనవసరంగా ఇద్దరు ఎంపీలను అనుమానంతో పిలిచి మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీకి మరికొందరిని అనుమానించటం ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో ఎటూ తేల్చుకోలేక టీఆర్ఎస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఒకవేళ నిజంగానే రేవంత్ అన్నట్టు ఎన్నికలకు ముందు ఎంపీలు పార్టీ మారితే టీఆర్ఎస్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే...!!