కోల్ కొతా లోకల్ ట్రైన్ లో బాంబు ప్రేల్లుళ్ళు
posted on May 12, 2015 8:38AM
కోల్ కొతాలో సెల్దా-కృష్ణా నగర్ మధ్య నడిచే ఒక లోకల్ ట్రైన్ లో ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి బాంబు ప్రేలుడు జరిగింది. అందులో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలులో ప్రయాణిస్తున్న రెండు వర్గాల మధ్య గొడవ మొదలవడంతో వారు ఒకరిపై మరొకరు బాంబులు విసురుకోవడం వలన ప్రేలుళ్ళు జరిగినట్లు ప్రాధమిక సమాచారం. రైలు టైటాఘర్ స్టేషన్ దాటిన తరువాత ఖర్దా స్టేషన్ చేరే ముందు ఈ ప్రేలుళ్ళు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారినందరినీ స్థానిక ఆర్.జి. ఖర్ మెడికల్ కాలేజి మరియు ఆసుపత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ప్రేలుళ్ళు తెల్లవారుజామున జరగడంతో అప్పటికి ఇంకా రైల్లో ప్రయాణికుల రద్దీ మొదలవదు కనుక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. లేకుంటే ఇది ఘోర ప్రమాదంగా మారి ఉండేది.
రైలులో ప్రయాణిస్తున్న రెండు వర్గాలు ఒకరిపై మరొకరు బాంబులు విసురుకొన్నారంటే ఆ సమయంలో రైల్లో అసాంఘిక శక్తులో లేకపోతే తీవ్రవాదులో బాంబులతో ప్రయాణిస్తున్నట్లు అర్ధమవుతోంది. నిత్యం వేలాదిమంది సామాన్య ప్రజలు ప్రయాణించే లోకల్ రైళ్ళలో అసాంఘిక శక్తులు ఏకంగా బాంబులతో ప్రయాణించగలుగుతున్నారు అంటే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగానే ఉన్నాయని స్పష్టం అవుతోంది.