తెలుసా మీకు కోహినూర్.. మన తెలుగింటి వజ్రం!
posted on Apr 6, 2025 10:37AM

కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు. అవును. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం పుట్టు పూర్వోత్తరాలు, కుల గోత్రాలు మనలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే.. ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నో చేతులు మారిన కోహినూర్ వజ్రం నిజానికి మన తెలుగింటి వజ్రం. కోహినూర్ పుట్టిల్లు మన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లోపుట్టిన అద్భుత వజ్రం కోహినూర్ వజ్రం. అందుకే,అందం, ఆస్తి, చదువు, అన్నీ ఉన్న వారిని, మన వాళ్ళు కోహినూర్ వజ్రంతో పోలుస్తారు. వాడి కేంటి కోహినూర్ వజ్రం అనే నానుడి అలా పుట్టిందే. అవును. కోహినూర్ వజ్రం, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన గుంటూరు జిల్లాలోని గోల్కొండ గనుల్లో పుట్టిన వజ్రం. కాకతీయ రాజుల కాలంలో గుంటూరు జిల్లా, (ప్రస్తుత పల్నాడు జిల్లా) బెల్లంకొండ మండలం కోళ్లూరు గనుల తవ్వకాలలో బయట పడిన వజ్రం కోహినూర్ వజ్రం. 186 క్యారెట్ల అద్భుత కాంతులతో (కోహినూరు అంటే,పారశీక భాషలో కాంతి పర్వతం) చారిత్రిక వజ్రంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయింది.
కాకతీయ రాజుల కాలంలో గోల్కొండ గనుల తవ్వకాలలో బయట పడిన 186 క్యారెట్ల కోహినూర్ వజ్రం కాకతీయ రాజుల సొంతం. కాకతీయ రాజులే కోహినూర్ అసలు యజమానులు. ఆ కాకతీయ రాజులే కోహినూర్ వజ్రాన్ని తమ కుల దైవం వరంగల్ భద్రకాళీ అమ్మవారి, ఎడమ కంటిలో ఉంచారు. అయితే అమ్మ వారి కంటి దీవెనగా నిలిచిన కోహినూర్ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎందరో రాజులు, చక్రవర్తుల చేతులు మారింది.
కాకతీయ రాజుల నుంచి ఢిల్లీ సుల్తాన్.,అల్లావుద్దీన్ ఖిల్జీ, చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయ సామ్రాజ్యం పై 14 వ శతాబ్దిలో ఖిల్జీ దండయాత్ర చేసి, కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అలా ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి, మారుతూ, చివరకు ముఘల్ చక్రవర్తి,బాబర్ చేతికి చేరింది. అయితే, 1739లో, ముఘల్ చక్రవర్తి ముహ్మద్ షా ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నపర్షియన్ రాజు నాదిర్ షా పోతూ పోతూ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు పట్టుకు పోయాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి కోహినూర్ వజ్రం మళ్ళీ చేతులు మారి పంజాబ్ మహా రాజు రంజిత్ సింగ్ ఖజానాకు చేరింది. అయితే, 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ ను స్వాధీనం చేసుకుంది. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకుంది. అలా సొంతం చేసుకున్న వజ్రాన్నిఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకు కానుకగా బహుకరించింది. ఇప్పడు మన కోహినూర్ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్ ప్రదర్శనలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు చూసి సంతోషిస్తున్నారు. అయితే కోహినూర్ తెలుగు వజ్రం అనే నిజం సందర్శకులు ఎవరికీ తెలియక పోవచ్చును.
అదలా ఉంటే కోహినూర్ వజ్రం గురించిన ఆసక్తికర విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో ఆశ్చర్య గొలిపే విషయం కోహినూర్ వజ్రం (పురుష ద్వేషో ఏమో) ధరించిన పురుషులను దురదృష్టం వెంటాడు తుంది..ట.అందుకే, బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే కోహినూర్ వజ్రం ధరించారు..ట. అలాగే, కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారూ ఉన్నారు. ఎంతైనా .. ఎక్కడ ఉన్నా మన కోహినూర్ ..కోహినూరే.. కదా ..మీరు ఎప్పుడైనా లండన్ వెళితే ఒక లుక్కేసి .. ఇది మాదే అని ఓ సారి కాలర్ ఎగరేసి.. రండి !