ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడి నామినేషన్

ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే  అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా? అంటే ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ఇంకా ప్రకటించకుండానే  మంగళవారం ( ఏప్రిల్ 23) రామ సహాయం రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేయడాన్ని బట్టి ఔననే భావించాల్సి వస్తున్నది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఖమ్మం బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామ సహాయం రఘురాంరెడ్డి స్వయంగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం గమనార్హం. ఇక చివరి నిముషం వరకూ ఈ నియోజకవర్గ అభ్యర్థి రేసులో పొంగులేని సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులో నిలిచారు. ఈ పంచాయతీ హైకమాండ్ వరకూ కూడా వెళ్లింది. ఇరువురి మధ్యా రాజీ కోసం కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఇరువురికీ నచ్చచెప్పారు. అయితే ఎవరికి వారు తమ వారికే టికెట్ ఇవ్వాలంటూ పట్టబట్టడంతో మధ్యే మార్గంగా రామ సహాయం రఘురాంరెడ్డికి ఖమ్మం లోక్ సభ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. రామ సహాయం రఘురాంరెడ్డి సామాన్యుడేం కాదు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన తండ్రి  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  రామసహాయం సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి పలు మార్లు  ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు, పేరు ఉంది. వయోభారం కారణంగా ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు.

ఆయన కుమారుడికే ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఇటు పొంగులేటి, అటు భట్టి నొచ్చుకోకుండా కాంగ్రెస్ మధ్యేమార్గంగా రఘురాం రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చింది. రామసహాయం రఘురాంరెడ్డికి రాజకీయ, సినీ రంగాలతో మంచి అనుబంధం ఉంది.   హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యారు.

అటువంటి రఘురాంరెడ్డిని ఖమ్మం అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా పార్టీలో ఎటువంటి అసమ్మతి, అసంతృప్తి తలెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత కనిపిస్తోంది. ఆ ఐక్యత ఖమ్మం సీటు కారణంగా చెడకుండా ఉండేలా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని  జాగ్రత్తలూ తీసుకుంటోందని ఖమ్మం సీటు విషయంలో వ్యవహరించిన తీరును బట్టి అర్ధం అవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ వెనుక పొంగులేటి , భట్టి విక్రమార్కల కృషి ఎంతో ఉంది. జిల్లాలో ఇద్దరూ ప్రముఖ నేతలే కావడంతో ఇరువురికీ ఇబ్బంది లేకుండా ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇలా ఉండగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కూడా పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇహనో ఇప్పుడో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావడానికి ముందే ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచార రాజేందర్ రావులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం మీద నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గుడువు ఉండగానే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్ధానాలకూ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.