ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటించని బీజేపీ!

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది. కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, బీజేపీ దానికి మద్దతు ఇచ్చింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రత్యేకహోదా హామీని అయినా నెరవేర్చండయ్యా బాబూ అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎంత మొత్తుకున్నా బీజేపీ ప్రభుత్వం కరుణించలేదు. ఆ కారణంతోనే బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెరిగింది. చివరికి స్నేహం ముగిసింది.
కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం రావాలన్న ధ్యేయంతో వున్న బీజేపీ ఈసారి అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు స్నేహహస్తం చాచింది. మొత్తానికి పొత్తు కుదిరింది. మూడు పార్టీలతో కూటమి ఏర్పడింది. బీజేపీ తన స్థాయికి మించిన విధంగా స్థానాలను పొందింది. బీజేపీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ తనకు పట్టున్న అనేక స్థానాలను బీజేపీకి అప్పగించింది. 
ఎన్నికల ప్రచారం సందర్భంగా కావచ్చు, అనేక రాజకీయ అంశాల పరంగా కావచ్చు టీడీపీ, జనసేన పాటిస్తున్న పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటించడం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, కూటమిది పై చేయి అయితే కూటమితే, వైసీపీది పై చేయి అయితే వైసీపీతో ప్రయాణం చేస్తే ఓ పనైపోతుంది బాబూ అన్న ధోరణిలోనే బీజేపీ వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమితో వున్నప్పటికీ బీజేపీకీ, వైసీపీకి లోపాయకారీగా ‘ఏదో’ వుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 
400 వందల సీట్లతో విజయం సాధించాలని కలలు కంటున్న బీజేపీకి, ఈసారి అధికారం దక్కుతుందా లేదా అనే భయం కూడా వుంది. అందుకే అవకాశం వున్న ఏ పార్టీనీ దూరం చేసుకునే ఉద్దేశంలో లేదు. అందుకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని, వైసీపీతో సీక్రెట్ స్నేహం నడుపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే, జగన్‌కి గాయం అయిందన్న వార్త ఇలా బయటకి వచ్చిందో లేదో, ఎక్కడో ఢిల్లీలో వున్న ప్రధాని మోడి తల్లడిల్లిపోయి తన రియాక్షన్‌ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలాంటి నాటకాలు ఆడటంలో జగన్ సిద్దహస్తుడని ఆల్రెడీ గత ఎన్నికల సందర్భంగా ప్రూవ్ అయింది. అలాంటి సంఘటనే మరోసారి జరిగినప్పుడు ఆచితూచి స్పందించాల్సిన బాధ్యత ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తికి వుండాలి కాదా. అలాంటిదేమీ పాటించకుండా జగన్ మీద ప్రేమ కురిపించేశారు. 
ఈ విషయంలో కొంతమంది బీజేపీ నాయకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలో వివరణ ఇస్తున్నారు. జగన్ మీద నిజంగానే హత్యాయత్నం జరిగిందని ప్రధానమంత్రి భావించారని, అందుకే అంత స్పీడుగా స్పందించారని, ఆ తర్వాత ఇదంతా ఒక డ్రామా అని అర్థం చేసుకుని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే, జగన్ ఆడిన డ్రామాని తెలుగుదేశం, జనసేన వర్గాలు నాన్ స్టాప్‌గా విమర్శిస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి అలాంటి విమర్శలేవీ లేవు. జగన్ ఆడింది డ్రామా అని తెలిసినా, ఇది డ్రామా అని ఒక్క బీజేపీ నాయకుడి నోటి నుంచి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూటమిలో వున్న మూడు పార్టీలు ఒకే మాట మీద వుండటం అనేది పొత్తు ధర్మం. కానీ బీజేపీ ఆ ధర్మాన్ని విస్మరించింది. ‘ధర్మం’ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ పొత్తు ధర్మాన్ని ఎందుకు విస్మరిస్తోందో!