ఆ ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం.. ఆ జిల్లా అభివృద్ధికి శాపం

 

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని సామెతను తలపిస్తోంది ఖమ్మం జిల్లా పరిస్థితి… జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్జమంత్రివర్గంలో ఏకంగా ముగ్గురుకి స్థానం కల్పించారు.. ముగ్గురులో ఒకరు సీనియర్ మంత్రి.. మరో ఇద్దరు తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.. వీరిలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టిసారించారు. మిగిలిన ఇద్దరు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు..ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన మల్లు భట్టి విక్రమార్క కూడా తన సొంత నియోజకవర్గమైన మధిర అభివృద్ధికే పరిమితమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటునడం వరకే పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించినప్పటికీ పెద్దగా అభివృద్ధి పై దృష్టి సారించలేదు.. గత ప్రభుత్వం మంజూరుచేసిన మున్నేరు రిటైనింగ్ వాల్  పనులనే పర్యవేక్షిస్తున్నారు.

ఇక మంత్రి తమ్మల మాత్రం తన సీనియారిటీని ఉపయోగించి జిల్లాలో కొద్దిపాటి నిధులతో చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. సీతారామ ప్రాజెక్టు కు సంబంధించి సాగర్ కాలువకు అనుసంధానం చేయాల్సిన పనులను రూ. 60కోట్లతో పూర్తి చేశారు. ఈ పని వైరా నియోజకవర్గంలో ఉన్నప్పటికి మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పంట పోలాలకు ఉపయోగపడే కార్యక్రమం. దీనిని పూర్తి చేయడానికి ఆయన ఓరకంగా యజ్ఞమే చేశారు.. నిత్యం కాంట్రాక్టర్ వెంటపడి తాను పర్యటనలు చేసి పూర్తిచేసి సాగర్ కాలువలోకి నీళ్లను వదిలారు.. దీని వల్ల సాగర్ కాలువ కింద ఉన్న సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరణ చేశారు. దీనికి నిధులు రాబట్టడంలో కూడా సమస్యలు ఎదుర్కోన్నారు. కేబినేట్ మీటింగ్‌లో నిధుల ప్రస్తావన రాగానే భట్టి అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. సీతారామ ప్రాజెక్టు పేరు మార్చకుండా నిధులు విడుదల చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ భట్టి అభ్యంతరాలను తోసిపుచ్చి నిధులు కేటాయించారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరతతో పాటు జిల్లాలోని ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లా అభివృద్ధి పడకేసింది.

కొద్దిపాటి నిధులతో పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి చేపడితే ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. భట్టి డిప్యూటీ సీఎం కావడం…. పొంగులేటి ముఖ్యమంత్రి తరువాత అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించడం వల్ల సమన్వయం చేసే పరిస్థితి లేక ఎమ్మెల్యేలు కూడా అయోమయం లో పడిపోయారు.. తుమ్మల మాత్రం తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.. ఆమేరకు జిల్లాలో పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా నిధులు కావాలన్నా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి మంజూరు చేయించుకుంటున్నారు..  ఈ నేపథ్యంలో ముగ్గురు కలిసేది లేదు.. జిల్లా అభివృద్ధి జరిగేది లేదనే భావన ప్రజల్లో ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu