ఫిర్ ఏక్ బార్., కేసీఆర్ సర్ కార్?

తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారి పోతున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది, ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది చేతులు కట్టేసింది. కాళ్ళకు సంకెళ్ళు, నోటికి తాళం  వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది, గాంధీ భవన్ నుంచి  రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి. 
నిజమే కాంగ్రస్ పార్టీని  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలకు ఆధారాలు ఏమిటీ అంటే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అయితే  రోజులు గడిచే కొద్దీ  వార్తల వేడి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు పొలిటికల్, సోషల్ మీడియా సర్కిల్స్ కు పరిమితమయిన  విశేష వార్తలు,  ఇప్పడు సామాన్యుడి  సంభాషణలోకి వచ్చేసాయి. మార్నింగ్ వాక్ లో  టీ దుకాణాలు, టిఫిన్ బండ్లు, కాఫీ షాపుల్లో, బస్సుల్లో, బస్ స్టాపుల్లో, మార్కెట్ ప్లేసుల్లో, చివరకు గుళ్ళూ గోపురాలో కూడా ఇప్పడు ఇవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అదేమంటే, రాజ్యాంగం, ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్రం... అన్నీ వచ్చేస్తాయి. 

సో .. ఇలాంటి ఈ వార్తల్లో నిజం ఎంత వుందో  చెప్పడం కుదరదు. కానీ, కొంతైతే నిజం ఉందని మాత్రం గంటాపథంగా చెప్పవచ్చని,అంటున్నారు. అవును అసలు నిప్పు లేనిదే పొగ  పొగ రాదు  కదా  అనుకోవచ్చును. అయితే, ఇదుగో తోక అంటే, అదిగో పులి అంటూ కథలు అల్లే నేర్పరులు కాంగ్రెస్ ప్రభుత్వం కథ ముగిసినట్లేనా? కథ ముగిసిందా? అంటూ కథలు వండేస్తున్నారు, వడ్డిస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  మౌనం వదిలి బయటకు వస్తున్న నేపథ్యంలో.. ఈ నెల ( ఏప్రిల్) 27 న వరంగల్ లో జరప తలపెట్టిన, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సిల్వర్ జూబ్లీ వేడుకల వేదిక నుంచి గులాబీ బాస్  పోరాట శంఖం పూరిస్తారనీ,ఇక అక్కడి నుంచి రాజకీయం మారిపోతుందనే వ్యూహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే  ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడ కూడా కష్టమే అని కొందరు  పండితులు  జోస్యం చెపుతున్నారు. 

అయితే  నిజంగానే పరిస్థితి అంత విషమంగా ఉందా  అంటే.. ముప్పు పొంచి  ఉన్నట్లు కనిపించినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేదు. మహా  అయితే, పడిపోతున్న గ్రాఫ్ ను నిలబెట్టుకునేందుకు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారిస్తే మార్చవచ్చును. నిజానికి అ స్కోప్ కూడా పెద్దగా లేదనే అంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఆదిస్థానం ఇప్పడు రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. హస్తం పార్టీ చేతిలో ఉన్నదే మూడు రాష్ట్రాలు, అందులో ఒకటి పోతే మిగిలేది, రెండు. నిజానికి  ఆ రెండు రాష్టాల్లోనూ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. అక్కడా, ఇక్కడని కాదు,దేశంలో ఎక్కడా హస్త రేఖలు సంక్రమంగా లేవు. అష్ట/షష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్  ప్రభావమో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కుంటోంది.  సో.. రేవంత్ రెడ్డిని తొలిగించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం  చేయక పోవచ్చును అంటున్నారు. మరో వంక బీజేపీ కూడా ఇప్పటి కిప్పుడు ఎన్నికలు కోరుకోవడం లేదు. కాబట్టి, రేవంత్ రెడ్డి సర్కార్  కు వచ్చిన ముప్పు లేదని అంటున్నారు.

అయితే, ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చను పక్కన పెడితే.. ఓ వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరో వంక కాంగ్రెస్ అధిష్టానం వరసగా వేస్తున్న తప్పటడుగుల పుణ్యాన రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అలాగే  ప్రధాన పార్టీల సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ ఖాయంగా అధికారంలోకి వస్తుందని  కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు. బహిరంగంగా చెప్పక పోవచ్చును కానీ, వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. ఫిర్ ఏక్ బార్. కేసీఆర్ సర్’కార్’ అంటున్నారు.  బీఆర్ఎస్ పడి లేచిన కెరటంలా మళ్ళీ మరో మారు అధికారంలోకి వస్తుందనే విశ్వాసం  కారు పార్టీలో  వ్యక్తమవుతోంది.