పాత సెంటిమెంట్‌ తోనే నామినేషన్‌ వేసిన కేసీఆర్‌

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గజ్వేల్‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు కోనాయిపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామిని హరీశ్‌రావుతో కలిసి కేసీఆర్‌ దర్శించుకున్నారు. నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి గజ్వేల్‌ చేరుకున్నారు. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

అయితే ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ఈ ఎన్నికలలో కూడా కేసీఆర్ అదే సెంటిమెంట్‌ ఫాలో అయి నామినేషన్‌ దాఖలు చేశారు.