లోక్ సభ ఎన్నికలు.. పోటీకి కేసీఆర్ కుటుంబం వెనుకంజ బీఆర్ఎస్ లో కనిపించని గెలుపు ధీమా!

నాయకుడు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుండి నడవాలి. పార్టీ పరాజయాల బాటలో ఉంటే పోటీకి నేనున్ననంటూ ముందుకు దూకాలి. పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో విశ్వాసాన్ని నింపాలి. అందుకు భిన్నంగా పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు అంతా నా మహత్మ్యమే అని విర్రవీగుతూ, పార్టీకి ఇబ్బందులు ఎదురుకాగానే క్యాడర్ కు, నాయకులకు ముఖం చాటేస్తూ.. వాళ్లంతా సరిగా పని చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ నిందలు వేయడం వల్ల ఉన్న వారు దురమవ్వడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేస్తున్న పని ఇదే. ఆ కారణంగానే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి.

సరే ఏ రాజకీయ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. పార్టీ నాయకుడి సత్తా ఏమిటన్నది, పార్టీ పరాజయం పాలైన తరువాతనే జనాలకు, పార్టీ క్యాడర్ కు కూడా బాగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే.. ఆ పార్టీ పరాజయం పాలైన ప్రతి సారీ గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో బలోపేతమైంది. ఆ పార్టీ నేత వెంట క్యాడర్ నడిచింది. అదే బీఆర్ఎస్ ను తీసుకుంటే.. ఒక్క పరాజయం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి.. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లను అంగీకరించి వాటిని దిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి బీఆర్ఎస్ అధినాయకత్వం తమ ఓటమికి ప్రజలనే నిందించడం, బోగస్ హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిందంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోయడంతో ప్రజలలో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారింది. అధికారంలో ఉండగా మితిమీరిన అతిశయంతో  వ్యవహరించిన అగ్రనాయకత్వానికి ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో నిలబెట్టేందుకు అభ్యర్థులే కరవైన పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యం ఏముంది. 

 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం (ఆవిర్భావ సమయంలో పార్టీ పేరు టీఆర్ఎస్) నుంచి ఎన్నికలు జరిగిన ప్రతి సారి అధినేత కేసీఆర్ లేదా ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు లోక్ సభ కు పోటీ చేసేవారు. పార్టీ ఆవిర్భవించింది 2001లో.. ఆ తరువాత 2004 ఎన్నికలలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.  తరువాత 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కాకుండా మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. రెండో  చోట్లా విజయం సాధించారు. పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు.  అయితే ఆ ఎన్నికలలో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేసి విజయం సాధించి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికలలో నిజామాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత పరాజయం పాలయ్యారు. అయితే అదే ఏడాది కేసీఆర్ సమీప బంధువు  జోగినిపల్లి సంతోష్ రెడ్డి  రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇలా పార్టీ  ఆవిర్భావం తరువాత నుంచి జరిగిన ప్రతి ఎన్నకలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు లోక్ సభకో రాజ్యసభకో ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడం, రానున్న లోక్ సభ ఎన్నికలలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ బరిలో లేకపోవడంతో మరో ఐదేళ్ల వరకూ ఆ కుటుంబం నుంచి ఎవరూ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించరని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికీ, పార్టీ పరాజయంతో  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించడానికి ముందుగా పోటీకి నిలవవలసిన ఆ కుటుంబం నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో క్యాడర్ లో నిరాస వ్యక్తం అవుతోంది.  ముందుండి నడిపించాల్సిన నాయకుడే వెనుకడుగు వేయడంతో బీఆర్ఎస్ లో విజయం పట్ల ధీమా, విశ్వాసం మచ్చుకైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu