మొహం చాటేశారా.. ముఖం చెల్లలేదా?

తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టీడీపీ అధినేత,   నారా చంద్రబాబు నాయుడు పరామర్శించిన సంగతి తెలిసిందే.  ముందుగా కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లను కలిసిన చంద్రబాబు ఆయన ఆరోగ్యం, సర్జరీ, చికిత్స గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ తో కొద్దిసేపు సంభాషించిన చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ కోలుకొని మామూలుగా నడిచేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని వివరించారు.  కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవ చేసేందుకు ముందుకు సాగాలని  ఆకాంక్షించారు. కేసీఆర్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 

రాజకీయంగా వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. అన్నీ పక్కన పెట్టేసి కేసీఆర్ కోసం  ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలలో విలువలకు, హుందాతనానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రస్తుతిస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ ప్రత్యర్థులపై పరుషంగా పన్నెత్తి ఒక్క మాటమాట్లాడిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  ఇక కేసీఆర్ ను బాబు పరామర్శిండం దగ్గరకు వస్తే.. ఇన్నాళ్లు తనను బద్ధ శత్రువుగా చూసిన కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించడం రాజకీయంగా చంద్రబాబు వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మరో సారి ప్రపంచానికి చాటింది. రాజకీయాలలో వ్యక్తిగతంగా ఏదీ ఉండకూడదని చంద్రబాబు మరోసారి  నిరూపించారు. ఇంత వరకూ బాగానే ఉంది.  కేసీఆర్ ను పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లినా అక్కడ కేసీఆర్ కుటుంబం లేకుండా జారుకోవడంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో  తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తారని తెలిసి కూడా   కేటీఆర్ అండ్ కో అక్కడ నుండి జారుకున్నారని అంటున్నారు. చంద్రబాబు ఏమీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా ఆసుపత్రికి రాలేదు. సోమవారం ఉదయం నుంచే చంద్రబాబు యశోదా అస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శిస్తారని మీడియా ప్రముఖంగా పేర్కొంది. అంటే చంద్రబాబు రాక గురించిన ముందస్తు సమాచారం లేకే కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత, సన్నిహిత బంధువు హరీష్ రావులు ఆస్పత్రిలో లేరని అనుకోవడానికి లేదు. ఒక వేళ ఆ సమయానికి వారికి వేరే పనులున్నా వాటిని రద్దు చేసుకునో, వాయిదా వేసుకును ఆసుపత్రి వద్ద చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు వారు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కేటీఆర్, కవితలు.   తమ తండ్రికి గురుతుల్యుడు, ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అన్నిటికీ మించి హైదరాబాద్ పురోగతిలో అత్యంత క్రియాశీల, కీలక పాత్రపోషించిన చంద్రబాబును రిసీవ్ చేసుకోకుండా ముఖం చాటేశారంటే.. అది అహంకారమా? ముఖం చూపించలేక తప్పుకున్నారా అంటూ నెటిజనులు పోస్టులు పెడుతున్నారు.    

నారా చంద్రబాబు నాయుడు అంటే  కేసీఆర్ కు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నాయకుడు.  కేసీఆర్ కు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కడంలో చంద్రబాబు కీలకం కాగా.. చంద్రబాబు క్యాబినెట్ లో కేసీఆర్ మంత్రిగా కూడా పనిచేసారు. చంద్రబాబు మనిషిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక సమయం పాలించిన సీఎం, తెలుగు రాష్ట్రాలలో సుదీర్ఘ అనుభవమున్న నేత చంద్రబాబు. అలాంటి నాయకుడు సంస్కారంతో, మానవతా దృక్ఫథంతో  ఫలానా సమయానికి ఆసుపత్రికి వస్తున్నారని తెలిసికూడా కేసీఆర్ తరపున ఎవరూ లేకుండా వెళ్లిపోయారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఉండగా.. వైద్యులతో భేటీ వరకూ చంద్రబాబుతో ఉన్నారు. తీరా తండ్రి కేసీఆర్ ను పరామర్శించే సమయంలో కేటీఆర్ లేరు. అలాగే మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అక్కడ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కేసీఆర్ ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స ప్రారంభమైన సమయం నుండి దాదాపుగా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావులలో ఎవరో ఒకరు ఆసుపత్రి వద్ద ఉంటూ వస్తుండగా.. కేసీఆర్ కు వరసకు కుమారుడయ్యే ఎంపీ సంతోష్ కుమార్ కూడా కేసీఆర్ తోనే ఉంటున్నారు. అయితే, సరిగ్గా చంద్రబాబు వెళ్లే సమయానికి కేసీఆర్ తో ఎవరూ లేరు. చివరికి ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే ఎంపీ సంతోష్ కూడా సమాయానికి అక్కడ లేరు. దీంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. పరమరించేందుకు వెళ్లిన వారికి ఘన స్వాగతాలు ఏమీ అవసరం లేదు. కానీ, ఒక స్థాయి నేతలు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఉండడం మర్యాదగా భావించాలి. మరి కావాలనే చేశారో.. లేక అనుకోకుండా జరిగిందో కానీ.. చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శిస్తుండగా.. వైద్యులు తప్ప కేసీఆర్ కుటుంబంలో మరెవరూ కనిపించలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక్కరే కాస్త దూరంగా కనిపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu