కేసీఆర్ ఆ ఏడుపేదో అసెంబ్లీలో ఏడ్వచ్చు కదా?

తాను జీవించి వున్నంతకాలం తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో బతికిన కేసీఆర్ అహంకారపూరిత పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. అందుకే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ భ్రమల్ని వదిలించారు. కేసీఆర్ అధికారాన్ని ఊడబెరికి, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. దాంతో అధికార వైరాగ్యంలో పడిపోయిన కేసీఆర్ ఇంతకాలం అసెంబ్లీ ముఖాన్ని చూడకుండా ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తూ ఏడునెలలపాటు టైమ్‌పాస్ చేశారు. దాదాపు పదేళ్ళపాటు అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్‌కి ఇంతకాలం ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న విమర్శలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకేనేమో, ‘కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు’ అనే మాట వినిపించకుండా చేయడం కోసమేమో, ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఏదో చిరాకు. తన సొంత ఆస్తిని ఎవరో అనుభవించేస్తున్నారన్న బాధ. తాను కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని తనకు కాకుండా చేశారన్న ఆవేదన ఆయన ముఖంలో కనిపించాయి. కొద్దిసేపు అసెంబ్లీలో కూర్చున్న ఆయన బయటకి వచ్చి, మీడియా ముందు తనదైన శైలిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, బడ్జెట్ మీద ఏడ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ని చులకన చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంలో కేసీఆర్ పక్కనే వున్న వెకిలి బ్యాచ్ వెకిలి నవ్వుల సంప్రదాయాన్ని కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ మీద ఏడ్చిన కేసీఆర్, ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లోనే సెటిలైపో్యారు.

కేసీఆర్ ఒక్కరోజు... అది కూడా కొద్దిసేపు అసెంబ్లీకి వచ్చింది ఎవర్ని ఉద్ధరించడానికి? అలా మొక్కబడిగా అసెంబ్లీకి వచ్చి పోవడానికేనా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చింది? బడ్జెట్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చింది, బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా? ఆ ఏడుపు విని, బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏవైనా పొరపాట్లు వుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది కదా? ఏడ్వాల్సిన చోట ఏడ్వకుండా, ఏడ్వాల్సినప్పుడు ఏడ్వకుండా వుండటం ఎంతవరకు కరెక్ట్?