నాగం స్వీయానుభవంతో చెపుతున్న మాటలవి
posted on May 20, 2015 8:30PM
‘ఎవరితోనయినా పెట్టుకోవచ్చు కానీ ఉస్మానియా విద్యార్ధులతో పెట్టుకొంటే యమా డేంజర్...వాళ్ళతో పెట్టుకొంటే ఎవరయినా దగ్ధం అయిపోతారు...జాగ్రత్త’ అని బీజేపీ నేత నాగం జానార్ధన రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి సలహా ఇవ్వడం చూసి, ఉస్మానియా విద్యార్ధులతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. ఎందుకంటే తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో ఆయన ఉస్మానియా విద్యార్ధులు నిర్వహించుకొంటున్న ఒక సమావేశానికి హాజరయినప్పుడు, వారు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేహశుద్ధి చేసారు. పలకరించడానికి వెళ్లిన ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో వారి బారి నుండి తప్పించుకొని బయటపడ్డారు. బహుశః తన స్వీయ అనుభవంతోనే ఆయన కేసీఆర్ కు ఆ విధంగా సలహా ఇస్తున్నారేమో?నని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.
కానీ ఆయన చెప్పిన మాటలలో వాస్తవం కూడా లేకపోలేదు. ఉస్మానియా విద్యార్ధులను కేసీఆర్ బచ్చాగాళ్ళని తీసిపారేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణా ఉద్యమంలో ఉస్మానియా విద్యార్ధుల పాత్రను విస్మరించడానికి లేదు. ఉద్యమాల కోసం వారు తమ చదువులను, ఆ కారణంగా తమ బంగారు భవిష్యత్తును కూడా వదులుకొన్నారు. ఇక బలిదానాలు చేసుకొన్న విద్యార్ధులు, యువత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. వారందరూ కేవలం తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడారు తప్ప రాజకీయ నాయకులలాగ ఎన్నడూ తమ త్యాగాలకు ఎటువంటి ప్రతిఫలమూ ఆశించలేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత వారికి ఎటువంటి గుర్తింపు కానీ గౌరవం గానీ లభించలేదు. కానీ ఇప్పుడు సాక్షాత్ కేసీఆరే వారిని బచ్చాగాళ్ళని ఈసడించుకొంటున్నారు. ఆ బచ్చాగాళ్ళ త్యాగాల వలననే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ఆయన కుటుంబ సభ్యులు అందరికీ మంత్రి పదవులు, యంపీ పదవులు దక్కాయని జనార్ధన రెడ్డి చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమని అందరికీ తెలుసు. అటువంటప్పుడు వారిని గౌరవించకపోయినా కనీసం ఈవిధంగా ఈసడించుకోకుంటే చాలు.
పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించవద్దని ఉస్మానియా విద్యార్ధులు కోరడం లేదు. విశ్వవిద్యాలయానికి చెందిన భూములలో నిర్మించవద్దని మాత్రమే వారు కోరుతున్నారు. అందుకోసం వారి గురించి కేసీఆర్ ఈవిధంగా చులకనగా మాట్లాడటం చాలా పొరపాటని జనార్ధన రెడ్డి చెపుతున్నారు అంతే. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంతాలకి, పట్టుదలకి పోయినట్లయితే, దాని వలన ఎదురు దెబ్బలు, ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఆయనకీ, తెరాసకి, ప్రభుత్వానికి కూడా మేలు జరుగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.