కవిత జనజాగృతి ఎఫెక్ట్.. పంచాయతీల్లో బీఆర్ఎస్ కుదేలు

తెలంగాణ‌లో  మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో బాగంగా తొలి రెండు విడతల పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయా అనిపించేలా ఉన్నాయి. రెండు విడతలలోనూ కూడా కాంగ్రెస్ హవా బ్రహ్మాండంగా సాగింది. ఈ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అయితే.. 193 మండలాల పరిధిలోని 3వేల‌, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు  గాను  1,728 మంది స‌ర్పంచ్‌లు కాంగ్రెస్ మద్దతుదారులే.  

తొలి విడతలో కాంగ్రెస్ హవాతో కంగుతిన్న బీఆర్ఎస్ రెండో విడత వచ్చే సరికి అప్రమత్తమైంది. రెండో విడ‌త‌లో  తడాఖా చూపాలని బీఆర్ఎస్ అగ్రనాయత్వం తన కేడర్ కుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది  అయినా కూడా రెండో విడతలోనూ బీఆర్ఎస్ చతికిల పడింది. కేవలం  912 స‌ర్పంచ్ స్థానాలలోనే విజయం సాధించింది.  గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్‌కు ప్ర‌జ‌ల నుంచి పెద్దగా మద్దతు లేదని ఈ రెండు విడతలలోనూ రూఢీ అయిపోయింది.  

వాస్తవానికి తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ తమదేనని బీఆర్ఎస్ భావించింది. కానీ ఫలితాలు వెల్లడైన తరువాత ఆ పార్టీకి విషయం బోధపడింది.  పోలింగ్ శాతం అధికంగా ఉన్న చోట్లా, , స్వల్పంగా నమోదైన చోట్లా కూడా కాంగ్రెస్ ఆధిపత్యం సుస్పష్టంగా కనిపించింది.  మొత్తంగా.. రెండు విడతల్లోనూ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా లేదనీ, ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందనీ తేటతెల్లమైంది.  ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పంచాయతీల్లో చతికిలబడటానికి కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. జగజాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత వ‌రంగ‌ల్‌, క‌రీంగ‌న‌గ‌ర్‌, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు.  ఆయా జిల్లాల్లోని ప‌ల్లెల్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. మొత్తానికి క‌విత దెబ్బ కూడా బీఆర్ ఎస్‌కు గట్టిగానే త‌గిలింద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu