కర్ణాటక ఎన్నికల పోలింగ్ ... ఆకట్టుకుంటున్న పింక్ బూత్ లు..

 

నేడు కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. వీటిలో 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎంత క్యూ ఉందో తెలుసుకునే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఓటర్లు గంటల తరబడి పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంది. పింక్‌ పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. మహిళా సిబ్బందితో నడిచే పింక్‌ పోలింగ్‌ కేంద్రాలను తొలిసారి ఈసీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ ఎన్నికల్లో మూడో జనరేషన్ ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదని, వీటిని ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే పనిచేయకుండా నిలిచిపోతాయని ఈసీ తెలిపింది.అంతేకాదు మొదటిసారిగా ఎన్నికల గీతాన్ని కూడా ఆవిష్కరించింది.