అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరగలేదు...
posted on May 12, 2018 6:00PM
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుపతికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిన నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతేకాదు.. తిరుపతిలోని అలిపిరి వద్ద అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల రాళ్ల దాడి చేశారని.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. కూడా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అమిత్ షా కాన్వాయ్ పై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని...కాన్వాయ్ లోని ఏడో కారు అలిపిరి వద్ద కొద్దిగా స్లోగా వెళ్లిందని... ఈలోగా సుబ్రహ్మణ్యం అనే వక్తి కర్రతో కారు అద్దం పగలగొట్టారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒకర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని... పోలీసు సిబ్బంది తప్పుందని తేలినా చర్యలు తప్పవని తెలిపారు.