ముస్లిం గర్భిణీ సజీవ దహనం...
posted on Jun 6, 2017 12:51PM

దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ గర్భిణీ స్త్రీని అత్యంత దారుణంగా సజీవ దహనం చేశారు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా గుండనకల గ్రామంలో బానూ బేగం అనే ముస్లిం మహిళ దళిత యువకుడైన సాయబన్న శరణప్ప కొన్నూర్ అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలలో తెలిసి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు బాను కుటుంబం అతనిపై కేసు నమోదు చేశారు. అయితే అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో అతనిని వదలిపెట్టారు. ఆ తరువాత అతను బాను తీసుకొని ఇంటినుండి పారిపోయి.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కర్ణాటకలోనే కొంతకాలం నివసించారు. ఈ క్రమంలో బాను గర్భవతి కావడంతో ఇరు కుటుంబాలు మారి ఉండవచ్చునన్న ఆశతో ఊరికి తిరిగొచ్చారు. కానీ వారిని చూసిన ఇరు కుటుంబాలు..గొడవకు దిగారు. బాను కుటుంబం బరితెగించి సాయబన్నపై దాడికి దిగింది. ఇక బాను కుటుంబ సభ్యులు ఆమెను కత్తితో పలుమార్లు పొడిచి.. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. ఇక ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాను కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.