డ్రోన్లతో పాక్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్
posted on May 8, 2025 6:20PM
.webp)
కరాచీ, లాహోర్, సహా ఇతర ప్రధాన నగరాలపై దాడి చేయడానికి భారతదేశం డ్రోన్‌లను ఉపయోగించిందని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన ఒక రోజు తర్వాత, లాహోర్, కరాచీలపై భారతదేశం డ్రోన్ దాడులు ప్రారంభించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది.ఇలా ఉండగా, భారత్ ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తోంది. పాక్ కు చుక్కలు చూపిస్తోంది. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ భారీగా ఎదురుదాడులు చేస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్‌పై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది.
అటు, రావల్పిండి హెడ్ క్వార్టర్ పైనా భారత్ డ్రోన్ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ మీడియా ముందుకొచ్చి ప్రపంచ దేశాలతో లబోదిబోమంటూ మొరపెట్టుకుంటోంది.లాహోర్, కరాచీ ఇంకా పాకిస్థాన్ లోని ఇతర ప్రదేశాలలో భారత్ వరుస డ్రోన్ దాడులు నిర్వహించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. మరోవైపు, కరాచీ విమానాశ్రయాన్ని సాయంత్రం 6 గంటల వరకు మూసివేసినట్లు పాకిస్థాన్ ప్రకటించగా, ఇస్లామాబాద్, లాహోర్‌లలో సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం మూసివేసినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది.