అన్న క్యాంటీన్లను రద్దు చేసి మద్యం దుకాణాల్ని తెరుస్తారా?
posted on May 6, 2020 5:24PM
జగన్ ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేసి.. పేద మహిళల పుస్తెలు తెంపే మద్యం దుకాణాలను తెరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో వైకాపా నేతలు కబ్జాలు, దౌర్జన్యాలు, దందాలు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా.. నవరత్నాలు పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఒక ముద్దాయి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఏపీని చూసి దేశ ప్రజలు తెలుసుకోవాలని కళా వెంకట్రావు హితవు పలికారు. సీఎం జగన్‌లో నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని కళా వెంకట్రావు విమర్శించారు. అధికారం చేపట్టిన 12 నెలల్లోనే రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి నెట్టారని ఆయన దుయ్యబట్టారు.