కడప మద్దతు సునీతకే

వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్న అంశం. త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను విపరీతంగా ప్రభావితం చేసే అంశం కూడా ఇదే.  కొంత మంది వ్యక్తులు అనాలోచితంగా చేసిన హత్య తిరిగి వారి మెడకే చుట్టుకోవడంతో బయటపడే మార్గం కోసం అడ్డదారులు తొక్కడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే వివేకా హత్య కేసులో ప్రత్యేకంగా చెప్పుకోదగిన వ్యక్తి ఆయన కుమార్తె డాక్టర్ సునీత. పులివెందుల ప్రజలు సునీతమ్మ అని అభిమానంతో పిలుచుకునే సునీత వృత్తి రిత్యాడాక్టర్. ప్రతిష్టాత్మకమైన క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన అనంతరం డెట్రాయిట్ లో ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా పులివెందులతో సహా కడప జిల్లా వాసులు సునీతను గౌరవిస్తారు.  మార్చి 15వతేదీ 2019వ సంవత్సరం వివేకా హత్య జరిగిన రోజు. ఆ రోజు నుంచి సునీత తండ్రి హత్యకు బాధ్యులైన వారికి శిక్షపడాలని పోరాటం చేస్తోంది. 

అంత పెద్ద రాజకీయ కుటుంబం నుండి వచ్చినా ఎక్కడా రాజీ  పడకుండా సునీత చేస్తున్న పోరాటం కడప జిల్లా ప్రజలను కదిలిస్తోంది.  వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సైతం సునీతమ్మ కన్నీళ్లకు కరిగిపోయాడు. తండ్రిని కోల్పోయి ఒంటరిగా  మిగిలిన సునీతమ్మకు న్యాయం జరగాలని ఇటీవల మీడియాతో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. వివేకా గుండె పోటుతో మరణించాడన్న అబద్ధాన్ని మొదట సునీత ప్రశ్నించింది. వృత్తిరిత్యా డాక్టర్ కావడంతో ఆమె అనుమానం వ్యక్తం చేసింది. కానీ, కుటుంబంలోని వ్యక్తులే తండ్రిని చంపారని తొలుత ఊహించలేకపోయింది.  తదననంతర పరిణామాలతో ఆమెకు నిజం పూర్తిగా అర్ధమైంది.

 ఆ క్రమంలో హత్య వెనుక ఉన్న వ్యక్తుల బెదిరింపులు సునీత అనుమానాన్ని మరింత బలపరిచాయి.  ఎదురింటి సందింటి  కుటుంబంలో నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో బాగా తెలిసిన సునీతమ్మ ఎంత  తెగువయచూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  నాలుగేళ్లుగా సాగుతున్న పరిశోధన ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకూ హైకోర్టు, సుప్రీం కోర్టులు కూడా ఈ కేసుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలవరించడం సునీత పట్టుదకు అద్దం పడుతోంది.  తెలుగుదేశం హయాంలో హత్య జరిగిందంటూ వాదించిన  వైసీపీ నేతలు ఇప్పటి వరకూ వివేకా హత్యకు డజన్ కు పైగా కారణాలను వెతికారు. అవన్నీ అబద్ధాలు అని అందరికీ తెలిసినా కేసును తప్పుదారి పట్టించేందుకు వైఎస్ కుటుంబం ప్రయత్నం చేసింది.

కానీ సీబీఐ పటిష్టమైన విచారణ  ముందు అవేమీ పని చేయలేదు. చివరకి హంతకులు ఎవరో, హత్యకు పథకం రచించిన వారు ఎవరో ప్రపంచం ముందు నిలబెట్టడంలో సునీత ఉత్తీర్ణురాలైంది. ఎప్పుడూ  అన్యాయాన్ని ప్రశ్నించని వైఎస్ కుటుంబం నుంచి ఒక  మహిళ న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని పులివెందుల ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రాంతంలో సునీతకు మద్దతు పెరుగుతోంది. రాజకీయాలకు, ఆడంబరాలకు దూరంగా ఉండే సునీత రాజకీయాల్లోకి వస్తే ఆదరిస్తామని కడప జిల్లా రాజకీయాలలో మార్పు కోరుకునే వారు అంటున్నారు.

 వైఎస్ కుటుంబంలో పెద్ద దిక్కుగా చెప్పుకునే రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత కాలం ఆ కుటుంబంలో మహిళల గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలలు అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.  వివేకా హత్య వరకూ బయటి ప్రపంచానికి తెలియని సునీత కూడా తండ్రికి న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది. ఏది ఏమైనా వివేకా హంతకులకు శిక్ష పడేంత వరకూ తన పోరాటం ఆగదని ప్రకటించి పోరాడుతున్న సునీత ధైర్యానికి కడప జిల్లా వాసులు జేజేలు పలుకుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu