సోనియాకు ఆ అర్హత లేదు.. జేసీ

 

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పై దుమ్మెత్తి పోశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పండ్ చేశారు. దీనికి గాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ ఇతరు కాంగ్రెస్ నేతలందరూ కలిసి పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు సోనియాగాంధీ చేస్తున్నధర్నాను జేసీ తప్పుబట్టారు. ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసేసి.. ఎంపీలను సస్పెన్షన్ చేసి మరీ రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేసిన సోనియాగాంధీకి ఇప్పుడు బ్లాక్ డే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. అసలు సోనియా గాంధీకి బ్లాక్ డే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. అనవసరంగా ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తమ పార్టీ స్వప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని విడదీసిన సోనియాకు ఆంధ్ర రాష్ట్రం తగిన బుద్ధి చెప్పిందని.. కొన్నిసంవత్సరాలైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమని విమర్శించారు. ఎంపీలను సస్పెండ్‌ చేస్తే బ్లాక్‌ డే అంటున్నారు...మరి రాష్ర్టాన్ని విభజించిన మిమ్మల్ని ఏమనాలని జేసీ ప్రశ్నించారు.