జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుంది : పవన్ కళ్యాణ్ 

జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 - 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తుచేశారు. అయితే, 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతిచోటా జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు.

2019లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ  నెంబర్ గానే చూడొద్దని అన్నారు. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. కాగా, 24 అసెంబ్లీ స్థానాలకు గానూ శనివారం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. జనసేనానితో పాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.