జనసేనానికి చుక్కలు చూపిస్తోన్న ఫేక్ లేఖలు...

ఫేక్ న్యూసులు రావడం సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఇవి రాజకీయాలల్లో వస్తుంటే నేతల సైతం ఏది నిజమే ఏది అబద్ధంమో తెలియక తలలు పట్టుకుంటూన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న లేఖలు జనసేన నేతల్ని హడలెత్తిస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ విషయంలోనూ తాజాగా ఇదే జరిగింది. మూడు రాజధానుల విషయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించి అసెంబ్లీలో ఈ అంశానికి అనుకూలంగా మాట్లాడినందున రాపాకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ సంతకంతో ఉన్న పార్టీ లేఖ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. 

వాస్తవానికి మూడు రాజధానులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడాలని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కానీ అసెంబ్లీలో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు రాపాక. ఇది జనసేన వర్గాలకు నచ్చలేదు. రాపాక తీరు పై పార్టీ కూడా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంతలోనే రాపాకను సస్పెండ్ చేస్తూ లేఖ రావడంతో కలకలం రేగింది. అధ్యక్షుడు వద్దన్నా సర్కారుకు అనుకూలంగా మాట్లాడినందున రాపాక మీద వేటు పడుతోందని అంతా ఊహించారు. అదే సమయంలో జనసేన పార్టీ లెటర్ హెడ్ పై పవన్ సంతకంతో ఉన్న లేక కావడంతో అంతా నిజమే అని భావించారు.ఈ లేఖ నెట్ లో విస్తృతంగా ప్రచారమవుతొంది. దీంతో పార్టీ మీడియా సెల్ ఆ లేఖను ఫేక్ గా తేల్చుతూ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

గతంలోనూ పలుమార్లు జనసేన పేరుతో ఫేక్ లెటర్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి.ఇలా లెటర్లు వచ్చి రాగానే వాటిపై అనుకూల ప్రతికూల పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వీటి వల్ల నష్టం కూడా ఉండటంతో నష్ట నివారణ చర్యలు తీసుకుని పార్టీ మీడియా సెల్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. జనసేన కు, పవన్ కల్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేసే బృందాలు బలంగానే ఉన్నాయి. కొందరు పవన్ అభిమానుల అత్యుత్సాహంతో ఇలాంటి ఫేక్ లెటర్స్ విడుదల చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఫేక్ దాడి తట్టుకోలేకపోతున్న జనసేన హైదరాబాద్ లో పోలీసులను కూడా ఆశ్రయించింది. అయినా లాభం కనిపించడం లేదు. ఈ ఫేక్ పోస్టులన్నీ పార్టీ రాజకీయ విధానాన్ని నిర్దేశించేవి నిర్ణయించేవి కావడంతో జనసేన తల పట్టుకొంటోంది. వాటి మీద వ్యక్తమయ్యే అభిప్రాయాలు నష్టం కలిగిస్తాయనే ఆందోళన కూడా ఉంది. ఇలాంటి లేఖలు ఎక్కడ నుంచి వచ్చాయో ఐపీ అడ్రస్ ద్వారా తెలుసుకోవచ్చు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవచ్చు, అయితే ఫేక్ లేఖలు రిలీజ్ చేస్తుంది ఎవరో అందరికీ తెలుసుననే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ అంశాల పై పవన్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.