త్వరలో జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి

 

టాలివుడ్ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోబోతోంది. జనసేన పార్టీ నమోదు విషయంలో ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాలని ఎన్నికల కమీషన్ ఒక ప్రకటన చేసింది. అంటే ఈ నెల 23 తరువాత ఏ సమయంలోనయినా జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారని, పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో యం.యల్యే.కోలనీలో స్పేస్ వ్యూ, ప్లాట్ నెంబర్: 91 చిరునామాలో ఉన్నట్లు పవన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.

 

పవన్ కళ్యాన్ ఎన్నికల తరువాత మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. కానీ త్వరలోనే పార్టీ నిర్మాణం చేసుకొని మళ్ళీ ప్రజలలోకి వస్తానని ఆనాడే చెప్పారు. కనుక జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత, ఆయన మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చును. ముందుగా ఆయన తన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తులను ఎంచుకొని వారితో పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, వారి సహకారంతో పార్టీని బలోపేతం చేసుకోగలుగుతారు. అయితే జనసేన పార్టీ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే మిత్రపక్షమయిన తెలుగుదేశం పార్టీతో ఏవిధంగా వ్యవహరిస్తుందనేది చాలా ఆసక్తికరమయిన విషయం కావచ్చును. ఎందువలన అంటే తను తెదేపా-బీజేపీలకు ఎన్నికలలో మద్దతు ఇచ్చినప్పటికీ, అవసరమయితే ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఆయన ముందే చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా ఇప్పటికే ఆ పని చేస్తోంది. ఇక జనసేన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా లేక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కు ప్రధాని మోడీతో ఉన్న సాన్నిహిత్యం ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వానికి ఏమయినా జనసేన సహకరిస్తుందా? వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu