లోటస్‌పాండ్‌కు జగన్ మకాం మార్పు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ను వీడి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసానికి మకాం మార్చనున్నారా? అంటే ఆయన సన్నిహితుల నుంచే కాదు పరిశీలకుల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణకు హైకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించిన నేపథ్యంలో జగన్ తాడేపల్లి నుంచి లోటస్ పాండ్ కు మకాం మార్చక తప్పదని అంటున్నారు.

ఇంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటూ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ కు ఇకపై ఆ అవకాశం ఉండదు.   దీంతో ఆయన ఇకపై కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందే అవకాశాలు దాదాపు మృగ్యమే.  జగన్ రెడ్డి ఉన్మాదమే కావచ్చు. పిచ్చితనమే కావచ్చు కానీ ఆయన ఊరికో ప్యాలెస్ చొప్పున కట్టేసుకున్నారు.   నిధులు, నిబంధనలు అనే సంగతెలా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ఆయన పాలనతో ఎంతగా వివాదాస్పదుడయ్యారో.. తన ప్యాలెస్ ల పిచ్చితో అంతగా పాపులర్ అయ్యారు. అవి  నిర్మించింది సొంత సొమ్ముతోనా? ప్రజాధనంతోనా అన్నది పక్కన పెట్టేస్తే ఆయన ఎక్కడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. 

  బెంగళూరు, తాడేపల్లి, విశాఖపట్నం.. పులివెందులలో కూడా ప్యాలెస్ పలాంటి భవనం ఉంది లెండి.  అయితే జగన్ రెడ్డి గద్దెదిగిన తరువాత ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో కానీ, పులివెందుల వాసంలో కానీ, ఆఖరికి రాష్ట్రం దాటిపోయి తన బెంగళూరు ప్యాలెస్ కు కూడా వెళ్ల లేని పరిస్థితి కొని తెచ్చుకున్నారు.   ఎన్నికలలో ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయకు అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిన జగన్ అక్కడెక్కడా స్థిమితంగా ఉండలేకపోయారు. మళ్లీ తాడేపల్లికి తిరిగి వచ్చారు. 
ఓటమి దిగులు నుంచి తేరుకున్నారా అనిపించేలా ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల తరువాత ఆయన బయటకు వచ్చారు. పాపం ముఖ్యమంత్రి హోదా లేదు కదా!  దాంతో పరదాలు కట్టించుకునే అవకాశం ఉండదని తెలిసి ఆయన నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లిని పరామర్శించడానికి హెలికాప్టర్ లో వచ్చారు. అక్కడ మీడియాతో కూడా మాట్లాడి నవ్వులపాలయ్యారు. అది వేరే సంగతి.

మళ్లీ ఆయన నివాసాల వద్దకు వస్తే.. ఇప్పుడాయన లోటస్ పాండ్ కు మకాం మార్చక తప్పని పరిస్థితి. కేసుల రోజువారీ విచారణే కాకుండా... గతంలోలా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి కూడా రావడం తథ్యం. ఈ పరిస్థితుల్లో ఆయన తాడేపల్లిలో స్థిమితంగా ఉండగలిగే అవకాశం లేదు. దీంతో ఆయన ఇప్పుడు ఏపీని వదిలేసి తెలంగాణకు బిచాణా ఎత్తేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూడా ఆయనకు మనస్థిమితం ఉండే అవకాశాలు లేవు.