చంద్రబాబుకు జగన్ సవాల్
posted on Aug 31, 2015 5:36PM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలైన తొలిరోజే గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జగన్, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. హత్యరాజకీయాల ప్రస్తావన కూడా మరోసారి తెరమీదకొచ్చింది. ఈ విమర్శల పర్వంలోనే జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా మాట్లాడిన బాబు.. లోక్ సభలో నాడు కాంగ్రెస్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే.. బాబు చేసిన ఈ స్టేట్ మెంట్ పై ఏమాత్రం వాస్తవం లేదని జగన్ ఖండించారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్ లో లేవన్నారు. ఒకవేళ.. ఎక్కడైనా ఉన్నాయని నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని.. లేకుంటే బాబే రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరారు. స్టేట్ మెంట్ లో ఒకటి ఉంటే చంద్రబాబు ఇంకొకటి మాట్లాడారని చెప్పారు.
అసెంబ్లీ వాయిదా పడిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్.. సభలో తమకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవం చాలా దారుణమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చంద్రబాబు సందేహంలో పడేశారని ఆరోపించారు. ఇలాంటి సభను తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. ఆయన చేసేవన్నీ దిక్కుమాలిన రాజకీయాలని, సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.