ఐదేళ్ల తరువాత దేనికి ‘సిద్ధం’ జగన్?

జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి ఐదేళ్లయ్యింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తరువాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికీ, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి అప్పుల వేటకీ పరిమితమైపోయారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేయడానికీ, ఆ ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలను రాష్ట్రం నుంచి తరిమేయడానికీ ఉపయోగించడానికే పరిమితమైన జగన్ జనం కష్టాలు, సమస్యలను అసలు పట్టించుకోనే లేదు. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేక జనాలకు ముఖం చాటేశారు.

అయితే ఐదేళ్లు గిర్రున తిరిగిన తరువాత ఓట్లు అభ్యర్థించడానికి జనం ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో గత్యంతరం లేక మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యాత్రను పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించి బస్సు యాత్ర ప్రారంభించారు. మేము సిద్ధం తొలి సభ  ప్రొద్దుటూరులో  జరిగింది. 

ఇంత కాలం జనం ముఖం చూడడానికి ఇష్టపడకుండా బారికేడ్లు, పరదాలు కట్టుకుని మరీ బయటకు వచ్చిన జగన్ ఇప్పుడు తన ఓట్ల అవసరం కోసం అవేమీ లేకుండా బయటకు వస్తే జనం ఆయన ముఖం చూడడానికి ఇష్టపడటం లేదా అన్న అనుమానం కలిగేలా ప్రొద్దుటూరు సభ జరిగింది.  నానా కష్టాలూ పడి సభకు జనాలను తరలించినా.. జగన్ ప్రసంగానికి వారిలో ఇసుమంతైనా స్పందన కనిపించలేదు.  ప్రొద్దుటూరులో జగన్ కు ఇలాంటి స్వాగతమే లభిస్తుందని పరిశీలకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు.  ప్రొద్దుటూరులో వైసీపీలో అంతర్గత కుమ్ములాటల గురించి తెలిసి కూడా జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రొద్దుటూరునే ఎన్నుకోవడం రాంగ్ ఛాయిస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సభ ప్లాప్ ప్రభావం ఆయన  యాత్ర మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందని రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. కడప లోక్‌సభ సెగ్మెంట్‌లోని ప్రొద్దుటూరు జగన్ అడ్డాగా నిన్నటి వరకూ ఉండేది. అందులో సందేహం లేదు.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ చివరిసారిగా గెలిచింది 2009లో మాత్రమే. 2014, 2019 ఎన్నికలలో ఈ స్థానంలో తెలుగుదేశం పరాజయం పాలైంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇక్కడ నుంచి గత రెండు ఎన్నికలలో కూడా సునాయాసంగా విజయం సాధించారు. అయితే 2024లో మాత్రం పరిస్థితులు ఆయనకు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు తోడు  సిట్టింగ్ ఎమ్మెల్యే   ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్త మౌతోంది.  దీంతో క్యాడర్ ముందుకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా లేదు. అలాగే యాదవ సామాజిక వర్గం కూడా రాచమల్లుకు దూరమైంది.  కౌన్సిలర్లు కూడా రాచమల్లుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి  వరదరాజులు రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. వరదరాజులు రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. దీనికి జనసేన, బీజేపీ క్యాడర్ కూడా కలవడంతో రాచమల్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక గత కొద్ది కాలంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. ఆ వలసల జోరు చూస్తుంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోతోందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  

ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రొద్దుటూరులో జగన్ మనమంతా సిద్ధం ప్రొద్దుటూరు సభ పార్టీలో జోష్ నింపే అవకాశం లేదని అంటున్నారు.  మనమంతా సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధమో  ఈ సభతో రుజువు అయ్యిందని చెబుతున్నారు. ప్రొద్దుటూరు   బహిరంగసభలో  జగన్ సుదీర్ఘ ప్రసంగం సభకు వచ్చిన వారి సహనానికి పరీక్షగా మారింది.  ఈ సభలో ఆయన తనపై వస్తున్న ఆరోపణలు ఖండించే ప్రయత్నం చేశారు. విశేషం ఏమిటంటే వివేకా హత్య విషయంలో ఇంకా చంద్రబాబునే నిందించే ప్రయత్నం చేశారు. వివేకాను తాము చంపలేదని .. చంపించలేదని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అంతా దేవుడికి తెలుసు, అలాగే జిల్లా ప్రజలకూ తెలుసు అంటూ అతి తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేశారు.  చిన్నాన్నను అన్యాయంగా చంపి.. నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు.  ఇంత కన్నా అన్యాయం ఉంటుందా?  అంటూ బేలగా ప్రజలను ప్రశ్నించారు.  

చిన్నాన్నను  దారుణంగా చంపి  బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వివేకాను చంపిన వారిని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు మద్దతు ఇస్తుంటే..  ఆ చంద్రబాబుకు  రాజకీయ లబ్ధి చేకూ ర్చేందుకు  తపించి పోతున్న ఒకరిద్దరు తన వాళ్లు ఆయనకు వంత పాడుతున్నారని జగన్ చెప్పారు. అయితే జగన్ ఎంతగా చెప్పినా జనం నుంచి స్పందన కనిపించలేదు. వివేకా హంతకులకు చంద్ర బాబు  మద్దతుగా ఉన్నారని జగన్ చెప్పినప్పుడు సభకు వచ్చిన జనం కనీసం చప్పట్లు కొట్టలేదు. జగన్ చెబుతున్నదంతా అబద్ధమని తమకు తెలుసునన్నట్లు మౌనంగా ఉండిపోయారు.  

ఇక డ్రగ్స్ కేసుపైనా సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు వదినగారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు. ఈ రెయిడ్‌ జరిగిందని తెలిసిన వెంటనే.. వైసీపీపై ఆరోపణలు చేయడం మొదలెట్టేశారని పేర్కొన్నారు.  విపక్షాల పొత్తులపైనా జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కడి మీదకు అందరూ కలిసి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు కళ్ల నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు.  

తన చెల్లెళ్లను కూడా తన మీదకు యుద్దానికి తెస్తున్నారన్నాని బాధపడ్డారు. అయితే చెల్లెళ్లు జగన్ కు వ్యతిరేకంగా నిలబడడానికి కారణాలేమిటో రాష్ట్రంలో అందరికీ తెలుసు దాంతో జగన్ మెలో డ్రామా జనానికి పట్టలేదు. వారి నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదు. మొత్తంగా మనమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించిన జగన్ తొలి సభ చప్పగా ముగిసింది. జనం నుంచి స్పందన లేకపోగా, పార్టీ శ్రేణులను కూడా ఉస్సూరుమనిపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.