బీజేపీ ప్రాపకం కోసం తెలుగుదేశం కూటమికి మద్దతు.. జగన్ దివాళాకోరుతనం!

ఎలాగోలా అధికారం దక్కించుకోవడం, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేసుకోవడం, ప్రత్యర్థులపై కక్ష సాధించడం, వారిని వేధింపులకు గురి చేయడం, వీలైతే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం, కస్టడీలో మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం తప్ప వైసీపీకి సిద్ధాంతం అంటూ ఉన్నట్లు కనిపించదు. 2019 ఎన్నికలకు ముందు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ  అధికారంలోకి వచ్చిన వైసీపీ అంతకు ముందు కూడా అంటే జగన్ తన కోసం తానే పెట్టుకున్న పార్టీగా తప్ప వైసీపీకి ఎలాంటి సిద్ధాంతం ఉన్నట్లు గోచరించదు. 2014 ఎన్నికలలో పరాజయం తరువాత జగన్ ఏదో విధంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో సెంటిమెంట్ అస్త్రాలన్నిటినీ వాడేశారు. తనపై కోడి కత్తి దాడి డ్రామా, సొంత బాబాయ్ హత్య కేసు, తల్లీ, చెల్లి ప్రచారం ఇలా ప్రతి అవకాశాన్నీ వాడుకుని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. సరే  రాష్ట్ర ముఖ్యంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత  జగన్ తన అధికారాన్నంతా ప్రత్యర్థులను వేధించడానికి, కక్ష సాధింపునకే వినియోగించారు. పాలన అంటే సంక్షేమం అంటూ బటన్ నొక్కడం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం మాత్రమే అన్నట్లుగా వ్యవహరించారు. 

 ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలలో పలుకుబడి, ఆదరణ లభించాలంటే విలువలు పాటించాలి.  కానీ జగన్ మాత్రం విలువలు అన్న మాటే మా పార్టీ డిక్షనరీలో లేదు అన్నట్లుగా వ్యవహరించారు.   ఫలితంగా  ఐదేళ్ల ముందు అధికారం కట్టబెట్టిన జనమే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి కనీసం ప్రతిపక్షంలో కూర్చునే అర్హత కూడా లేదని విస్పష్టంగా తీర్పు ఇచ్చారు. అయితే జగన్ మాత్రం ప్రజా తీర్పును ఆపహాస్యం చేస్తున్న చందంగా మాట్లాడుతున్నారు. నెపం ఈవీఎంల మీద నెట్టేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఈవీఎంలు ప్రజా తీర్పునకు అద్దం పడతాయనీ, ప్రతి ఓటరూ తన ఓటు ఎవరికి పడిందో వీవీపాట్ లో చూసుకోవచ్చని చెప్పిన జగన్.. ఓటమి తరువాత మాట మార్చేసి ప్రజలంతా తనకే ఓటేశారనీ, కానీ ఈవీఎంలను ట్యాంపర్ చేసి చంద్రబాబు మోసం చేశారన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. 

సరే అదలా ఉంచితే.. తన పార్టీకి సిద్ధాంతమనేదే లేదని జగన్ మరో సారి రుజువు చేశారు. నైతికంగా వైసీపీ దీవాళాకోరుతనానికి ఇంతకు మంది ఉదాహరణ అవసరం లేదన్నట్లుగా ఈయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఉంది. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. రాష్ట్రంలో జగన్ ను, జగన్ పార్టీనీ ఉనికిమాత్రంగా ఎన్నికల ఫలితాలు మార్చేశాయి. కేంద్రంలో ఉన్న అండతోనే ఈవీఎంలను మాయ చేసి చంద్రబాబు అదికారంలోకి వచ్చారని స్వయంగా జగన్ చెప్పారు. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చేయడానికి ఒక పక్క సంప్రదింపులు చేస్తూనే మరో పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కరుణాకటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం  కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు మద్దతు ఇవ్వడమంటే.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే అనడంలో సందేహం లేదు. అయినా జగన్ ఎన్డీయేకే మద్దతు ఇవ్వడానికే నిర్ణయించారు.  

ఎన్డీయే కూటమి తరఫున ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఓం బిర్లాను బీజేపీ ప్రకటించింది.  కూటమిలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీ తెలుగుదేశం. అంటే కూటమి అభ్యర్థిగా ఓం బిర్లా తెలుగుదేశం ఆమోదించి, అంగీకరించిన అభ్యర్థే అవుతారు.  అలాంటి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడానికి నిర్ణయిం చుకుంది.  ఏపీలో  తెలుగుదేశంతో  పోరాడుతూ… ఢిల్లీలో అదే పార్టీ  కూటమి తరపున నిలబెట్టిన అభ్యర్థికి జగన్ మద్దతు ఇస్తున్నారు.  ఇంత కంటే దిగజారుడు తనం ఉంటుందా అని సొంత పార్టీలోనే జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉండి  అధ్వాన పాలన సాగించిన జగన్..   బీజేపీ ప్రాపకం కోసం సొంత పార్టీకి రాజకీయ సమాధి కట్టడానికి కూడా రెడీ అయిపోయారు.