జగన్ కు భారీ షాక్.. ఐదుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు జంప్!?

రాష్ట్రంలో  ఘోర పరాజయం పాలైనా.. సెంటర్ లో తమ బలం ఇంకా ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మా అవసరం ఉంది. రాజ్యసభలో మాకు బలం ఉంది. కేంద్రం ఏ  బిల్లు పాస్ చేయాలన్నా మా మద్దతు అనివార్యం అంటూ విర్రవీగుతున్న జగన్ కు సొంత పార్టీ రాజ్యసభ సభ్యులే ఝలక్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు జగన్ కు జెల్ల కొట్టి బీజేపీలోకి దూకూయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు రాజ్యసభలో బలం ఉంది. చక్రం తిప్పడానికి మాకు అన్ని అవకాశాలూ ఉన్నాయంటూ చెప్పుకుంటున్న జగన్ కు ఆ బలం పోవడం ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే  , విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్రావు, అయోధ్యరామిరెడ్డిలు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లారంటున్నారు.  

రానున్న రోజులలో వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగలడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లే జగన్ కు కళ్లూ, నోరు, చెవులూ మాదిరిగా వ్యవహరించిన ఎ2 విజయసాయి రెడ్డి నేతృత్వంలోనే ఓ ఐదుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధమైపోయిందం టున్నారు. కాగా వీరి చేరికను ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదనీ, అయితే ఒక వేళ వారికి బీజేపీలోకి ఎంట్రీ లేకపోయినా, జగన్ పార్టీకి దూరం జరిగి తమను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని వీరు స్పీకర్ ను కోరనున్నారని సమాచారం.  

అయితే రాజ్యసభలో అవసరమైన బలం లేని బీజేపీ వీరి రాకను స్వాగతించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇందుకోసం బీజేపీ తెలుగుదేశం అధినేతను ఒప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందని రాజకీయవర్గాలలో చర్చ జోరుగా సాగుతోంది. ఒక సారి వైసీపీ నుంచి వలసలు మొదలైతే అది ఇక ఆగకుండా సాగుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే తాజా ఎన్నికలలో వైసీపీ నుంచి లోక్ సభకు ఎన్నికైన నలుగురిలో ఇద్దరు పక్క చూపులు చూస్తున్నారని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.