ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం.. ఆగ్రహిస్తారా.. బుజ్జగిస్తారా?

ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టమ్స్, నో మొఖమాటమ్స్  అంటూ ఎమ్మెల్యేలకు జగన్ ఇప్పటికే  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పని తీరు బాగాలేదని కొందరు ఎమ్మెల్యేలను పేరుపెట్టి మరీ హెచ్చరించారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై తాడేపల్లిలో గతంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ మంత్రులు , పార్టీ సమన్వయకర్తల సమావేశంలో  సీఎం జగన్  పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. రెండు నెలలే గడువిస్తున్నాననీ హెచ్చరించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని జగన్ అప్పుడే విస్పష్టంగా చెప్పేశారు.
 ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జగన్ అప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించారు. వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలన్నారు. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లల్లో భోజనాలు చేయాలని, ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలని కూడా జగన్ ఆదేశించారు.   సమస్యల్ని గుర్తించి తక్షణమే పరిష్కరించాలని  ఆదేశించారు.  

పనితీరు సరిగ్గా లేని వారిపై వేటు తప్పదని పార్టీ అధినేత జగన్ చేసిన హెచ్చరికలు అప్పట్లో ఎమ్మెల్యేల్లో కలవరం రేపాయి. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ సమావేశం జరిగింది. ఆ తరువాత కూడా జగన్ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికలలో వైనాట్ 175 అంటూ వచ్చే ఏన్నికలలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేశారు? పార్టీ ఎమ్మెల్యేల సహనాన్ని తెగేదాకా లాగారు. ఇంకే ముంది గట్టు తెగింది. అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాతో మొదలైన తిరుగుబాటు పవనాలు రాష్ట్ర మంతటా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో జగన్ మరో సారి   పార్టీ నేతలతో కీలక భేటీకి సిద్ధమయ్యారు. అన్ని వైపుల నుంచీ ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న వేళ, ఆర్థిక అష్టదిగ్బంధనంలో సర్కార్ చిక్కుకుపోయి.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి సైతం అప్పుపుట్టని స్థితిలో ఆయన ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారు. ఎలా నడుచుకోవాలో, ప్రజాభిమానాన్ని ఎలా కూడగట్టుకోవాలో దిశా నిర్దేశం చేయడానికి సిద్ధమౌతున్నారు. అంతే కాదు.. ముఖ్యమంత్రిగా ఇంత వరకూ  ప్రతి పర్యటనా పరదాల మాటున చేసిన జగన్ ఇప్పుడు జనం ముందుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇంత కాలం తాను ముఖం చాటేసి ఎమ్మెల్యేలను గడపగడపకూ పంపిన జగన్ ఇక తాను కూడా  ప్రజల మధ్యకు వెళ్లి తన ప్రభుత్వం చేసిన మంచిని వివరించడానికి రెడీ అవుతున్నారు. ఇందు కోసమే ఆయన మరో సారి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకి సిద్ధమౌతున్నారు. అందు కోసం పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు రెడీ చేశారు. వీటికి తోడు ఐప్యాక్ సర్వేలు, అవి కాకుండా తాను సొంతంగా చేయించుకున్న మరో రెండు సర్వే రిపోర్టులతో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే నియోజకవర్గ సమన్వయ కర్తలతో ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లా పరిణామాల నేపథ్యంలో ఈ సారి అయన ఎమ్మెల్యేలతో భేటీలో ఏం మాట్లడతారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలోలా కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ లకు దిగితే మొదటికే మోసం వచ్చే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని, ఇప్పటి వరకూ అంతర్గతంగా ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందన్న ఆందోళన పార్టీ కీలక నేతల్లో వ్యక్తం అవుతోంది. ఒకింత అనునయంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నట్లు ఆ విషయాన్ని జగన్ కు చెప్పడానికి మాత్రం ఎవరూ సాహసించడం లేదు. మరో వైపు ఆనం, కోటం రెడ్డిల ఎపిసోడ్ తో జగన్ రగిలిపోతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

పని తీరు బాగాలేని, గడపగడపకు కార్యక్రమంలో సీరియస్ గా పాల్గొనని వారిపై జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అలాగే ప్రజలలో ఎమ్మెల్యేలకు ఉన్న ఆదరణ, వారి పనితీరు ఆధారంగా తాను స్వయంగా తెప్పించుకున్న నివేదికలు, సర్వేల ఆధారంగా ప్రోగ్రస్ రిపోర్టు కూడా రూపొందించుకున్నారనీ, దాని ఆధారంగా ఎమ్మెల్యేలకు కర్తవ్యబోధ, దిశానిర్దేశం చేయడానికి జగన్  సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 13న పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో భేటీకి జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.    పని తీరు మెరుగుపరుచుకోని ఎమ్మెల్యేలకు మరోసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా?  లేక సర్దుకోండని చెబుతారా అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

ఎందుకంటే విజయమే ప్రాదిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఇప్పటికే జగన్ పలుమార్లు స్పష్టం చేశారు.   అలాగే ఇక క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠత, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంకు తానే స్వయంగా నడుంబిగించడం ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులలో కూడా చురుకుపుట్టించేందుకు వ్యూహాత్మకంగా సీఎం పర్యటనలకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం తాను, తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలలోనే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెబుతున్నారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఇక సీఎం తో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీట్లు..ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి అయితే వైసీపీలో ఆల్ ఈజ్ వెల్ పరిస్థితి లేదనీ, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే అదే స్థాయిలో అసమ్మతి కూడా పెల్లుబుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో నాలుగు రోజులలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లోనే కాదు, రాజకీయ వర్గాలలోనూ వ్యక్తమౌతోంది.