అమరావతే ఏకైక రాజధాని.. విస్పష్టంగా తేల్చేసిన కేంద్రం

జగన్ సర్కార్ కు దింపుడు కళ్లెం ఆశ కూడా అడుగంటి పోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాటకు కేంద్రం విస్పష్ట ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టేసింది,  పార్లమెంటు సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం 2015నే నోటిఫై చేసిందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటన అమరావతి విషయంలో హై కోర్టు తీర్పును కేంద్రం సమర్ధించినట్లైంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఏపీ విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా  నిర్ణయించడం జరిగిందనీ, దానినే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2015లో నోటిఫై చేసిందని పేర్కొన్నారు. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ఆధారంగానే అమరావతి రాజధానిగా ఏర్పాటైందని ఆయన ఆ సమాధానంలో స్పష్టం చేశారు. మూడు రాజధానుల పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలతో తమకు సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. అలాగే మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ తమను సంప్రదించలేదని కూడా స్పష్టం చేశారు. రాజధాని మార్పు విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఏపీ ప్రభుత్వానికి లేదని కూడా ఆయన తన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మార్చాలంటే కేంద్రం అనుమతి ఉండటమే కాకుండా, పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర విస్పష్టంగా తేల్చి చెప్పినట్లు అయ్యింది.   సుప్రీం కోర్టులో ఈ నెల 23న రాజధానుల అంశం కోర్టుకు రానున్న నేపథ్యంలో కేంద్రం రాజ్యసభ వేదికగా ఇచ్చిన ఈ సమాధానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ కేసు విషయంలో సుప్రీం కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇదే విషయాన్ని అంటే విభజన చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని తన అఫిడవిట్ లో పొందుపరిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాదన వీగిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా త్వరలో అంటే వచ్చే నెలలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానంటూ ఇటీవల జగన్ చేసిన ప్రకటన కూడా ఎందుకూ కొరగానిదిగా మారిపోయిందని చెప్పవచ్చు.  విజభన చట్టం ప్రకారమే ఏపీ ఏకైక రాజధానిగా ఏర్పాటయ్యిందని తేటతెల్లమైపోయింది.  ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5,6 లతో రాజధాని అమరావతిని ఏర్పడిందని, దీనిని మార్చే  అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా తేల్చేసింది.